గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి వ్యవహారం ఇప్పుడు ఆన్లైన్లో హాట్ టాపిక్‌గా మారింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌కి ఆయన సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. కేసులు పెడతామని హెచ్చరించారు. దీనికి కారణం.. పొన్నూరులో టీడీపీ కార్యకర్త ఒకరిని సోషల్ మీడియా పోస్టులు పెట్టారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాన్ని నారా లోకేష్ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. పోలీసులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయితే.. అనూహ్యంగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఈ ట్వీట్ పై స్పందించారు. ఫ్యాక్ట్ చెక్ అంటూ…. నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
వెంటనే.. లోకేష్‌ది తప్పుడు ప్రచారం అయితే.. చర్యలు తీసుకోవాలనే కామెంట్లు వచ్చాయి. దీనికి లోకేష్ ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. దైర్యం ఉంటే.. నిజాయితీ ఉంటే.. పెదకాకాని పోలీస్ స్టేషన్లోపలి సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదంతా బుధవారం జరిగింది. గురువారం.. పొన్నూరు టీడీపీ కార్యకర్తను ప్రశ్నించడానికి పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చామని పోలీసులు వివరణ ఇచ్చారు. ఇది చాలు కదా.. ఎస్పీ అమ్మిరెడ్డి తీరును సోషల్ మీడియాలో ఎండగట్టడానికి. వెంటనే లోకేష్.. అసలు సోషల్ మీడియా పోస్టులు పెడితే.. ప్రశ్నించాలని ఎవరు చెప్పారని మండిపడ్డారు.
రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారని.. పైగా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. నిజాయితీగా పని చేయాలని రాజకీయ బాసులు చెప్పినట్లుగా చేస్తే తీవ్రమైన ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. మొత్తానికి అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వర్సెస్ లోకేష్ వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అర్బన్ ఎస్పీ తీరు చర్చనీయాంశం అయింది.