ఉర్జిత్ పటేల్… ఇప్పటివరకూ ఏ ఆర్బీఐ గవర్నర్ పేరూ అన్ని సార్లు పత్రికల్లో నానలేదేమో, ప్రజల్లో తిరగలేదేమో!`దేశచరిత్రలో ఒక సంచలన నిర్ణయం వెలువడిన అనంతరం మోడీ చాటు బిడ్డగా కామెంట్స్ ఎదుర్కోవడంతో పాటు ఆర్బీఐ ప్రతిష్టను దిగజార్చుతున్నారంటూ విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి! పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం సామాన్యులు ఎదుర్కొన్న ఇబ్బందులకు అధికారికంగా ప్రధాన బాధ్యత మోయాల్సిన ఉర్జిత్… నాడు ఏ సందర్భంలోనూ ప్రజలకు వివరణ ఇచ్చిందిలేదు. ప్రభుత్వం ప్రకటించిన గడువు పూర్తయ్యింది.. అయినా కూడా ఇప్పటివరకూ బ్యాంకులకు పాతనోట్లు ఎన్ని వచ్చి చేరాయి.. నల్లధనాన్ని ఎంతవరకూ అరికట్టగలిగారు.. బ్యాంకుల ముందు క్యూలు కట్టి ఎన్నో ఇబ్బందులు పడిన సామాన్యుడి కష్టం, ఆశాజీవి ఎదురుచూపులు బూడిదలో పోసిన పన్నీరైనట్లేనా.. ఇలా ఏ విషయంపైనా ఈ “మౌనం” మాట్లాడలేదు. ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా కొత్త నోట్లు బయటకు వెళ్లడంపై కూడా మౌనాన్నే తమ బాషగా చేసుకున్నారు ఉర్జిత్. అయితే తాజాగా ఈ “మౌనం” మాట్లాడింది!!
అవును… పెద్ద నోట్ల రద్దు అంశంపై వివరణనిచ్చేందుకు కాంగ్రెస్ నేత ఎం వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆదేశించిన మీదట ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నో కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్న ఆయన.. అసంతృప్తిగా సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది. నగదు విత్ డ్రాయల్స్ పై ఆంక్షలెప్పుడు ఎత్తివేస్తారు? మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? పెద్ద నోట్ల రద్దు తర్వాత మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోకి అసలెంత వచ్చింది? ఈ అన్ని విషయాలపైనా కచ్చితమైన లెక్కలు చెప్పండి? వంటి ప్రశ్నలను కమిటీ సభ్యుల నుంచి ఎదుర్కొన్న ఉర్జిత్ సంతృప్తికరమైన జవాబులు ఇవ్వలేకపోయారట. డీమోనిటైజేషన్ అనంతరం పాత రూ. 500, రూ. 1,000 నోట్లు ఎన్ని తిరిగి వచ్చాయన్నది కూడా ఉర్జిత్ పటేల్ కచ్చితంగా చెప్పలేకపోయారని, దీంతో మరోసారి ఈయన్ను ప్రశ్నించాలని కమిటీ నిర్ణయించింది.
కమిటీ వేసిన ప్రశ్నలు దేనికీ ఉర్జిత్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంపై స్పందించిన సీనియర్ నేత ఒకరు… “డీమానిటైజేషన్ పై ఆర్బీఐ అధికారులు డిఫెన్స్ లో పడ్డారని తెలుస్తోంది” అని వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే… డీమోనిటైజేషన్ అంశంపై 2016 తొలి నాళ్ల నుంచి ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయని పటేల్ వివరించడం ఇక్కడ కొసమెరుపు!! కాగా… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24వ గవర్నర్ గా 4 సెప్టెంబరు 2016న ఉర్జిత్ పటేల్ నియమితులైన సంగతి తెలిసిందే.