వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్దిరేటు అసాధ్యం. అది 7 నుంచి 7.75 శాతంగా వుంటుంది. ఇందుకోసం ఆదాయపు పన్ను లో రాయితీలు ఇవ్వకూడదు. పరిమితి పెంచకూడదు.పన్ను చెల్లిపుదారుల పరిధిని 5.5 శాతం మంది నుంచి 20 శాతం మందికి విస్తరింపజేస్తే మంచిది. ఇవన్నీ జరిగినా కూడా 2008 నాటికి పరిస్థితులు పునరావృతం అయితే మాత్రం వృద్దిరేటు బాగా తగ్గముఖం పడుతుంది.- ఈ విషయాలను భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఆర్ధిక సర్వేలో కేంద్ర ఆర్ధిక శాఖకు సూచించారు.
బడ్జట్ రూపొందించడంలో ఆర్ధిక సర్వే కీలకమైన డాక్యుమెంటే. అయినా కూడా పాలక పక్షం కమిట్ మెంట్లు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగానే ఆర్ధిక మంత్రి బడ్జెట్ రూపొందిస్తారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే సంవత్సరంలో పన్నుల మోతకు సబ్సిడీల కోతకు పూనుకుని ఓటర్లకు దూరమవ్వడానికి బిజెపి సాహసిస్తుందా? అన్నది అనుమానమే! సర్వేలో మౌలిక సూచనలకు బడ్జెట్ కు మధ్య తీవ్రమైన వ్యత్యాసం వుంటే ఆర్ధిక వ్యవస్ధ తల్లకిందులైపోతుంది. ఈ నేపధ్యంలో సోమవారం అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టే బడ్జెట్ కర్రవిరగని, పాముచావని భారీ అంకెల గారడీతప్ప మరే మౌలికమౌన మార్పూ వుండే అవకాశంలేదు.
ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకునే వరకు ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులను గాడిలో పెట్టాల్సి ఉంది. ఈ ఏడాది కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కాగా భారత్ మాత్రం వృద్దిరేటు దిశగానే ప్రయాణిస్తోంది. అయితే విదేశాల్లో జరిగే పరిణామాలు మనపై కూడా పడతాయి. వృద్దిరేటు 7 నుంచి 7.75 సాధించాలంటే ప్రభుత్వం తక్షణమే సబ్సిడీలపై కోత విధించాలని, జీఎస్టిని అమలు చేయాలని ఆర్థిక సర్వేలో సూచించారు. అయితే చైనా మరోసారి కరెన్సీ విలువను తగ్గిస్తే భారత్ కు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
చిన్న పొదుపు పథకాలు ఉదాహరణకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీపీ) కమాడిటీలపై సబ్సిడీలు ఉదాహరణకు వంట గ్యాస్, విద్యుత్‌పై కోత విధించాలని సూచించింది. వంటగ్యాస్, విద్యుత్‌పై సామాన్యులు కాకుండా సంపన్నులు లబ్ధి పొందుతున్నారని.. ప్రభుత్వానికి సబ్సిడీల భారం రూ. లక్ష కోట్లు దాటిపోతోందని పేర్కొంది. పీపీఎఫ్ డిపాజిట్లు ప్రభుత్వం వద్ద రూ.3.19 లక్షల కోట్ల వరకు మూలుగుతున్నాయి. ప్రభుత్వం దీనిపై పన్ను రాయితీ ద్వారా ప్రభుత్వం రూ.12వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోతోంది. పీపీఎఫ్ పేరుకే చిన్న పొదుపు పథకాల స్కీం కానీ వాటిలో లబ్ది పొందిదే మాత్రం 20నుంచి 30 శాతం వరకు పన్ను చెల్లించే వారని ఆర్థిక సర్వేలో ఎత్తిచూపింది.
వంట గ్యాస్ సబ్సిడీ, కిరోసిన్, విమానాలను వినియోగించే ఇంధనంపై సబ్సిడీలపై కు విక్రయించడం వల్ల ప్రభుత్వం రూ.46వేల కోట్ల వరకు నష్టపోతోందని సర్వే వెల్లడించింది. రైల్వేప్యాసింజర్లకు సబ్సిడీల ద్వారా రూ.3,700 కోట్లు, విద్యుత్ మార్కెట్ ధర కంటే తక్కువకు విక్రయించడం వల్ల రూ.37వేల కోట్లవరకు ప్రభుత్వం నష్టపో తోందని సర్వేలో ఎత్తిచూపించింది. బంగారంపై పన్ను రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వం రూ.4వేల కోట్ల వరకు నష్టపోతోంది. సాధారణ వస్తువులపై 26 శాతం పన్ను విధిస్తే బంగారంపై 1-1.6 శాతం వరకు మాత్రమే పన్ను విధిస్తున్నారని ఆర్థికసర్వే పేర్కొంది.
ప్రభుత్వం వీటన్నిటిపై అడ్డకట్ట వేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా సమాజానికి కూడా మంచిదని.. అయితే ఇవన్నీ వాస్తవరూపం దాల్చాలంటే రాజకీయంగా అందరి మద్దతు కావాల్సి ఉంటుందని పేర్కొంది.