విజయనగరం రాజుల ఫ్యామిలీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెట్టిన చిచ్చును.. రాజకీయంగానే ఎదుర్కోవాలని… ఇంక ఏ మాత్రం సహించకూడదని… గజపతుల కుటుంబం నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా జగన్ ప్రభుత్వ సహకారంతో రాత్రికి రాత్రే కుర్చీ ఎక్కిన సంచయిత.. గజపతుల కుటుంబాన్ని పదే పదే అవమానిస్తున్నారు. వారి ప్రతిష్టకు నిలువెత్తు దర్పణంగా ఉండే మహారాజా కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా సిరిమాను ఉత్సవం సందర్భంగా కోటపై ఆనందగజపతిరాజు కుటుంబం కూర్చోకుండా చేసి.. అవమానించి పంపేశారు. ఈ వ్యవహారంపై… గజపతిరాజుల కుటుంబం అటో ఇటో తేల్చుకోవాలని డిసైడయింది. ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తె అయిన సంచయితకు ఏడాది వయసు ఉండగానే తల్లిదండ్రులకు విడాకులయ్యాయి.
అప్పటి నుంచి ఆమెకు గజపతిరాజుల కుటుంబంతో సంబంధాలు లేవు. అయితే.. జగన్ సర్కార్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఏకంగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి తెచ్చుకుని గజపతిరాజు కుటుంబంలో చిచ్చు పెట్టారు. సంచయితను ఎదుర్కోవడానికి తాను సిద్ధమని.. ఆనందగజపతిరాజు రెండో భార్య కుమార్త్ ఊర్మిళా గజపతి రాజు చెబుతున్నారు. మా తాత, తండ్రి పరువును సంచయిత మంటగలుపుతున్నారని ఊర్మిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచయిత అనే వ్యక్తిని మాన్సాస్ ట్రాస్ట్ చైర్ పర్సన్ కాక ముందు తామెప్పుడూ చూడలేదంటున్నారు. ప్రస్తుతం చదువుకుంటున్నా.. భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు.
పీవీజీ రాజు, ఆనందగజపతిరాజు ఆశయాలకు విఘాతం కలిగించే అంశాలపై న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు. సంచయిత వ్యవహారం కుటుంబ పరువు ప్రతిష్టల్ని దిగజార్చేలా ఉండటంతో ఆమెకు అధికార బలం ఉన్నత కాలం.. వీలైనంత సైలెంట్ గా ఉండాలని.. గజపతిరాజుల ఫ్యామిలీ భావిస్తోంది. అయితే సంచయిత మాత్రం… ఈ లోపే.. తనకు జన్మనిచ్చిన తండ్రి వంశం పేరు ప్రతిష్టల్ని.. ప్రజల్లో గౌరవ మర్యాదల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా.. వ్యవహరిస్తున్నారు. దీని వల్ల ఎవరికి ప్రయోజనమో.. ఆమె కూడా అంచనా వేసుకోలేకపోతున్నారు.