ఊర్వశీ రౌటాలా.. ఈ పేరు అప్పుడప్పుడూ తెలుగు తెరపై వినిపిస్తుంటుంది. కొన్ని సినిమాల్లో ఐటెమ్ గీతాలు చేసింది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ పక్కన ఆడి, పాడింది. దాంతో కాస్త పాపులారిటీ తెచ్చుకొంది. అయితే… ఈ అమ్మాయికి ఫాంటసీలు చాలా ఎక్కువ. ఏదోలా… సోషల్ మీడియాలో తన పేరు నానాలని తెగ ప్రయత్నిస్తుంటుంది. ట్రోలింగ్ కి కావాల్సినంత కంటెంట్ ఇస్తుంటుంది. పిచ్చి పిచ్చి చేష్టలు చేసి పబ్లిసిటీ తెచ్చుకొంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి యధావిధిగా గొప్పలు చెప్పుకొంది. బద్రీనాథ్ సమీపంలో తన పేరుతో ఓ గుడి కట్టారని, వీలైతే తన అభిమానులు ఆ గుడిని సందర్శించాలని, దక్షిణాదిన కూడా తన కోసం గుడులు కడితే, ఆనందిస్తానని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లకు గుడులు కట్టడం దక్షిణాది వాళ్లకు అలవాటే. కాకపోతే.. ఇక్కడ పాయింట్ వేరు. బద్రీనాథ్ సమీపంలో బామ్నీ అనే గుడి వుంది. ఊర్వశీని అంతా బామ్నీ అని ముద్దుగా పిలుచుకొంటారు. అలాగని ఆ గుడి తన పేరు మీదే కట్టారు, తన కోసమే కట్టారు అనుకొంటే ఎలా? దాంతో బామ్నీ గుడి అర్చకులు ఊర్వశీపై మండి పడుతున్నారు. వెంటనే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.
దీనిపై.. ఊర్వశీ రౌటాలా టీమ్ కూడా స్పందించింది. `తన పేరు మీద ఉన్న గుడి అని… ఊర్వశీ అన్నారు కానీ, అది తన గుడి అని అనలేదని` కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఊర్వశీ వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకొంటున్నారని, ఊర్వశీ ఎవరి మనోభావాల్నీ దెబ్బ తీయ లేదని స్పష్టం చేశారు. అయితే ఊర్వశీ ఇలా చేయడం ఇది మొదటి సారి కాదు కాబట్టి, పొరపాటు అనుకోవడానికి వీల్లేదు. అలవాటు ప్రకారం.. పబ్లిసిటీ కోసం చేసిన ట్రిక్కు అని.. నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు. ఏదేమైనా ఊర్వశీ ఇలాంటి ఫాంటసీలు తగ్గించుకొంటే మంచిది.