అమెరికా తరచూ పాకిస్తాన్ కి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. ఇకపై నిధులు, ఆయుధాలు విదిలించేది లేదని ఖరాఖండిగా చెపుతూనే ఉంటుంది. ఒకసారి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే మరోసారి ఏ విదేశాంగ కార్యదర్శో హెచ్చరికలు జారీ చేస్తుంటారు.
పాకిస్తాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందుకు ధీటుగానే బదులిస్తుంటుంది. అమెరికా విదిలించే ఆ ముష్టి చిల్లర పైసలు తమకి అక్కరలేదని, అమెరికా యుద్ద విమానాలు అమ్మకపోతే వేరే దేశం నుండి కొనుక్కోగలమని చెపుతుంటుంది. పాకిస్తాన్ భూభాగంలో అమెరికా డ్రోన్ లతో దాడి చేయడాన్ని తమ దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడమేనని దానిని తాము సహించబోమని హెచ్చరిస్తుంటుంది.
ఆ రెండు దేశాలమద్య ఇటువంటి మాటల యుద్ధాలు ఏడాది పొడవునా సాగుతూనే ఉంటాయి. కానీ మళ్ళీ పాకిస్తాన్ కి నిధులు అందించవలసిన సమయం వచ్చినప్పుడు, అమెరికన్ కాంగ్రెస్ పాకిస్తాన్ కి ఏమాత్రం లోటు కాకుండా బారీగా నిధులు విడుదలకి ఆమోద ముద్ర వేసేస్తుంటుంది. ఇది చాలా ఏళ్లబట్టి సాగుతున్న తంతే. ఈసారి కూడా అదే జరిగింది.
ఉగ్రవాదంపై పోరుకోసం అమెరికా ప్రతీ ఏటా పాకిస్తాన్ కి వందల మిలియన్ డాలర్లు సహాయం చేస్తుంటుంది. ఈసారి కూడా 900 మిలియన్ డాలర్ల సహాయం మంజూరు చేసింది. ఈసారి దానిని 700 మిలియన్ డాలర్లకి తగ్గించాలనే ఒక ప్రతిపాదనని, అసలు నిధులే ఇవ్వకూడదనే మరో ప్రతిపాదనని అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్) తిరస్కరించింది. అణ్వాయుధ దేశం అయిన పాకిస్తాన్ లో భద్రత విషయంలో రాజీపడకూడదని కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు. అందుకే యధాప్రకారం మొత్తం 900 మిలియన్ డాలర్ల సహాయం పాకిస్తాన్ కి అందజేయాలని నిర్ణయించారు.
పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కటినంగా వ్యవహరించడం లేదని, తక్షణమే అది భారత్ తో తన సంబంధాలను బలపరుచుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టాలని అమెరికా నిన్ననే హెచ్చరించింది. మళ్ళీ 24 గంటలు తిరగకుండానే ఏకంగా 900 మిలియన్ డాలర్ల సహాయం అందిస్తోంది. పాకిస్తాన్ తనకు హానీ, ఇబ్బంది కలిగిస్తున్న ఉగ్రవాదులపైనే పోరాడుతోంది. అదే సమయంలో భారత్ పై పోరాడుతున్న ఉగ్రవాదులకి అన్ని విధాల సహాయ సహకారాలు, శిక్షణ కూడా ఇస్తోంది. అది కూడదని ప్రధాని నరేంద్ర మోడీ తో సహా విదేశాంగ శాఖ, నిఘా వర్గాలు అందరూ చాలాసార్లు చెప్పారు. కానీ పాక్ తీరు మారలేదు. మార్చుకొనే ఉద్దేశ్యం కూడా కనబరచలేదు. బహుశః అది ఎన్నటికీ మారకపోవచ్చు కూడా.
పాక్ ప్రభుత్వం ఆ సొమ్ముని ఉగ్రవాదుల నిరోధానికే కాక, భారత్ పై దాడులు చేసేవారిని ప్రోత్సహించడానికి కూడా ఖర్చు చేయకుండా ఉంటుందంటే నమ్మశక్యంగా లేదు. అంటే అమెరికా అందిస్తున్న ఆ సహాయం కొనసాగుతున్నంత వరకు పాక్ ఉగ్రవాదులు భారత్ పై దాడులు చేస్తూనే ఉంటారని భావించక తప్పదు. కనుక అమెరికా అందిస్తున్న ఆ బారీ ఆర్ధిక సహాయం అపాత్రాదానంగానే భావించక తప్పదు.
అమెరికాకి ఈ విషయం తెలియకపోదు. కానీ మత ఛాందసవాదులు, ఉగ్రవాదులు, భారత్ పై యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పాక్ సైనికాధికారులు, వారికి అన్ని విధాల అండదండలు అందించే ఐ.ఎస్.ఐ. అధికారుల కనుసన్నలలో పాక్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, ఆ దేశంలో కుప్పలు పోసున్న అణ్వాయుధాలని వారి నుండి కాపాడటం చాలా కష్టం. వారినందరినీ ఆ అణ్వాయుధాలకి దూరంగా ఉంచడానికి వారికీ, అమెరికా, పాకిస్తాన్ మద్య ఎటువంటి ఒప్పందం జరిగిందో తెలియదు కానీ ప్రతీఏటా పాకిస్తాన్ కి సహాయం పేరిట అమెరికా భారీగా డబ్బు చెల్లించుకొంటూనే ఉంది. అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ తో అమెరికా బలమైన సంబంధాలు కలిగి ఉండటం కోసం ఇంత బారీ నిధులు ఇవ్వడం చాలా అవసరమని అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధులు చెప్పడమే అందుకు ఒక నిదర్శనంగా భావించవచ్చు.