వేతన జీవులకు చకచకా ఇంక్రిమెంట్లు పెరిగితే భలే ఆనందం. బాస్ బోనస్ ఇస్తే మహదానందం. మంచి జీతం వస్తుందంటే మరో కంపెనీకి జంప్ చేసే కల్చర్ అమెరికా నుంచి భారత్ కు పాకింది. ప్యాకేజీ కల్చర్ కారణంగా కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులను వీలైనంత సంతృప్తికరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది ఉద్యోగులకు ఊరట కలిగించే విషయం. భారత్ లో చాకిరీ ఎక్కువ సాలరీ తక్కువ అనే మాట చాలా ఆఫీసుల్లో వినపడుతుంది. ఇంతకీ ప్రపంచంలో ఎక్కువ జీతాలు తీసుకునే అదృష్టవంతులు ఎక్కడున్నారో తెలుసా?
ఆయాదేశాల్లో ఉద్యోగుల సగటు వేతనంపై కొన్ని అంచనాలు, లెక్కలు వాడుకలో ఉన్నాయి. కంపెనీలు, ఆఫీసులు ఎన్ని ఉన్నా, సగటున ఉద్యోగులకు ఎంత వేతనం వస్తుందనడానికి కొన్ని ప్రాతిపదికల ఆధారంగా లెక్కగట్టారు. దీని ప్రకారం, ప్రపంచంలో అత్యధిక సగటు వేతనం లభించే దేశం అమెరికా. అక్కడ ఏడాదికి సగటు వేతనం 55 వేల డాలర్లు. సగటున వారానికి 44 పని గంటలు.
ఉద్యోగులను ఇబ్బందిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకునే యాజమాన్యాలు అమెరికాలోనే ఎక్కువట. కొన్ని రకాల కంపెనీల్లో ఉద్యోగుల ఇంటికి క్యాబ్ పంపడం అనేది పెద్ద ఎత్తున అమల్లో ఉన్న దేశం కూడా అమెరికానే. ఉద్యోగుల ఆటపాటలకు కూడా అమెరికాలో ప్రాధాన్యం ఎక్కువట.
సగటు వేతనాల్లో అమెరికా తర్వాత నెంబర్ టూ దేశం ఐర్లండ్. అక్కడ సరాసరి వార్షిక వేతనం 51 వేల డాలర్లట. లక్సెంబర్గ్ మూడో స్థానంలో ఉంది. భూతల స్వర్గంగా పాశ్చాత్యులు పిలుచుకునే స్విట్జర్లాండ్ 4, కంగారూ దేశం ఆస్ట్రేలియా 5, ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన యునైటెడ్ కింగ్ డమ్ 6వ స్థానంలో ఉన్నాయి. అమెరికాకు పొరుగున్న ఉన్న కెనడా 7వ స్థానం, ఐరోపా దేశం నార్వే 8వ స్థానం పొందాయి.
అత్యధిక వేతనాల్లో ఆసియా ఖండం నుంచి పాశ్చాత్య దేశాలతో పోటీ పడిన ఒకే ఒక్క దేశం దక్షిణ కొరియా. అది 9వ ర్యాంకు పొందింది. అక్కడ సగటు వార్షిక వేతనం 35,406 డాలర్లు. అక్కడ ఉద్యోగులు వారానికి సగటున 45 గంటలు పనిచేస్తారు. అత్యధిక వేతనాల టాప్ 10 జాబితా తయారు చేస్తే, అందులో చివరగా ఉండే దేశం నెదర్లాండ్స్. కొరియా, ఆస్ట్రేలియాను మినహాయిస్తే అన్నీ పాశ్చాత్య దేశాలే.
భారత్ లో 2009 అంచనాల ప్రకారం సగటు వేతనం 295 డాలర్లు. ప్రపంచంలో మనది 67వ ర్యాంక్. అయితే తాజా గణాంకాలు అందుబాటులోకి వస్తే ఏమేరకు వేతనాలు పెరిగాయనేది తెలుస్తుంది. అయితే, పాశ్చాత్య దేశాల స్థాయిలో భారతీయ ఉద్యోగులు వేతనాలు పొందాలంటే ఇంకెన్ని దశాబ్దాలు, లేదా శతాబ్దాలు పడుతుందో.