అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందూ వెనుకా ఆలోచించకుండా చేస్తున్న వాణిజ్య యుద్ధంలో చైనా కూడా తాను తగ్గేది లేదని చెబుతోంది. రెండు దేశాలు ఒకరిపై ఒకరు పన్నులు పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో చైనా నుంచి ఎగుమతులు ఆగిపోతే అమెరికా ఎదుర్కొనే గడ్డు పరిస్థితిని చైనా ఏఐ వీడియోతో కామెడీ చేస్తోంది.
అమెరికాలో తయారీ పరిశ్రమ పెద్దగా అభివృద్ధి చెందలేదు. తయారీ పరిశ్రమలు ఉంటే కాలుష్యం అని .. వాటిని అమెరికాలో పెట్టాలంటే సాధ్యం కాదని అమెరికన్ కంపెనీలు కూడా చైనాతో పాటు ఇతర దేశాల్లోని కంపెనీలకు తయారీ బాధ్యతలు ఇస్తాయి. యాపిల్ నుంచి అన్ని కంపెనీలు చేసేది అదే. అదే సమయంలో చైనా తయారీ రంగంలో ఓ విప్లవం సృష్టించింది. ప్రపంచ దేశాలకు ఇప్పుడు చైనా తయారీ వస్తువులు చాలా కీలకం. గుండు పిన్ను నుంచి యుద్ధసామాగ్రి వరకూ చైనా ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటోంది.
అమెరికాకు ఎగుమతులు చాలా ఎక్కువ. అదే సమయంలో చైనా అమెరికా నుంచి కొనేది కూడా ఏమీ ఉండదు. అమెరికా ఏమీ ఉత్తినే దిగుమతులు చేసుకోదు. అవసరం కాబట్టే చేసుకుంటుంది. ఇప్పటికిప్పుడు వాటికి ప్రత్యామ్నాయం కనుగొనడం అంత తేలిక కాదు. ఈ విషయాన్నే సూటిగా..ఏఐ వీడియోలతో చైనా చెబుతోంది. ట్రంప్ , మస్క్ ఫోన్లు ఫిక్స్ చేసుకుంటున్నట్లుగా..బట్టలు కుట్టుకుంటున్నట్లుగా చూపిస్తూ వీడియోలు తయారు చేశారు. అలాగే అమెరికన్లు ఓబేసిటీతో బాధపడే విషయంపైనా సెటైర్లు వేస్తోంది చైనా.
ట్రంప్ ఇలాగే వ్యవహరిస్తే.. అగ్ర రాజ్యంగా చైనా మారినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం ఇప్పటికే ప్రపంచవర్గాల్లో ఉంది. మిగతా దేశాలన్నీ సుంకాలపై చర్చలకు రెడీ అయితే చైనా మాత్రం ఎదురు సుంకాలు వేస్తూ లొంగే ప్రశ్నే లేదని సంకేతాలు పంపడమే కాదు.. ట్రోల్ చేస్తోంది.