అమెరికా ప్రభుత్వం.. ఇతర దేశాల నుంచి నకిలీ పత్రాలతో.. అమెరికాలో చదువు కోసం వచ్చి.. ఉద్యోగాలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో తెలుగు విద్యార్థులు దొరికిపోయారు. అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులే ఏకంగా యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనే ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఇమిగ్రేషన్ అక్రమాలు చేస్తున్న వాళ్లకోసం అధికారులు మారువేషాల్లో వలపన్నారు. అక్రమంగా అడ్మిషన్ పొందిన వారందరినీ అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో తెలుగు వారు ఉండటంతో.. ఈ వ్యవహారం కలకలం రేపింది. డెట్రాయిట్ పోలీస్ స్టేషన్లో 14 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ యూనివర్శిటీ ద్వారా 600 మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలను ఇచ్చారు. ఈ పత్రాలను అందించేందుకు ఎనిమిది మంది తెలుగు వాళ్లు సహకరించారు. వీరందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.
భరత్ కాకిరెడ్డి, అశ్వంత్ నూనె, సురేష్ రెడ్డి కందాల, ఫనిదీప్ కర్నాటి, ప్రేమ్ కుమార్ రాంపీస, సంతోష్ రెడ్డి సామ, అవినాష్ తక్కళ్లపల్లి, నవీన్ ప్రత్తిపాటి అనే యువకులు అరెస్టయినట్లు తెలుస్తోంది. ఉన్నత చదువుతో పాటు.. పార్ట్‌టైమ్‌గా జాబ్‌చేస్తూ డాలర్లను పోగేసుకోవచ్చనే ఆశతో మనోళ్లు చాలా మంది విద్యార్థులు రెక్కలు కట్టుకొని అక్కడికి ఎగిరిపోతున్నారు. ఏ మాత్రం అవగాహన లేకపోవడం.. కన్సెల్టెన్సీలపై ప్రధానంగా ఆధార పడడం, యూనివర్సిటీల చరిత్ర తెలుసుకోకపోవడం వంటి కారణాలతో నిలువునా మోసపోతున్నారు.
కొన్నేళ్ల క్రితం ట్రై వ్యాలీ యూనివర్సిటీ బాగోతం కలకలం రేపిందిట్రైవ్యాలీ వర్సిటీకి గుర్తింపే లేదని పేర్కొంటూ.. భారత విద్యార్థుల కాళ్లకు సంకెళ్లు వేశారు అమెరికా అధికారులు. . ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు లేదు. ఆ తర్వాత సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ వర్సిటీల ఉదంతాలు బయటపడ్డాయి. వీటిలో చేరేందుకు వస్తున్న వారిని విమానాశ్రయం నుంచి వెనక్కి పంపేశారు. గతంలోనూ.. ఫెడరల్ అధికారులు… ఇలా అండర్ కవర్ ఆపరేషన్లు నిర్వహించి అక్రమ వలసదారుల్ని పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు దొరికిపోయిన తెలుగు విద్యార్థుల్ని కాపాడేదుకు న్యాయసహాయం అందించేందుకు తెలుగు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.