అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ రెండో తేదీన ప్రపంచదేశాలపై తాము విధించబోతున్న పన్నులను ప్రకటించారు. నిజానికి ఇది చాలా మంది ఆయా దేశాలపై విధిస్తున్న సుంకం అనుకుంటున్నారు. నిజానికి ఆ భారం విధించింది అమెరికా ప్రజలపైనే. ఆ విషయం చర్చకు జరగకుండా.. ప్రపంచ దేశాలపై పన్నులు విధిస్తున్నట్లుగా ఆయన చెప్పుకుంటున్నారు. ప్రచారం చేసుకుంటున్నారు.
భారత్ నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై 26 శాతం పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే నేరుగా మన దేశంపై ఆయన పన్నులు వేయడం లేదు. మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అక్కడ పన్నులు పెంచారు. దాని వల్ల వాటి ధరలు అమెరికాలో పెరుగుతాయి. వాటిని కొని ఉపయోగించుకునే అమెరికన్లు ఇంకా ఎక్కువ ధర పెట్టాల్సి వస్తుంది. పన్నులు ఎక్కువగా ఉండటం వల్ల.. మన వస్తువులకు డిమాండ్ తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే తక్కువ ధరకు వస్తున్న కారణంగా ఎగుమతలు అవుతున్నవి తక్కువే.. అక్కడ దొరకనివే భారత్ ఎక్కువగా ఎగుమతులు చేస్తోంది. అయితే ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఎక్కువ దెబ్బ అమెరికా ప్రజలపైనే ఉంటుంది.
అమెరికా ప్రజలను పన్నులతో బాదేస్తూ..ఇలా వచ్చే ఆదాయంతో పన్నులు తగ్గిస్తానని ట్రంప్ చెబుతున్నారు. ఆయన ప్రకటన చూసి నవ్వాలో ఏడవాలో అమెరికన్లకు అర్థం కాని పరిస్థితి. దేశ అప్పులు తీరుస్తానని అంటున్నారు. ట్రంప్ తీరు వల్ల అమెరికాలో తయారీ పెరుగుతుందో లేదో చెప్పడం కష్టం. నిరుద్యోగం తగ్గుతుందో లేదో తెలియదు. ఒక్క భారత్ పైనే కాకుండా దిగుమతులు ఉన్న అన్ని దేశాలపై పన్నులు భారీగా విధించడం వల్ల.. అమెరికన్లను మాత్రం ట్రంప్ నిలువు దోపిడీ చేయబోతున్నారు.