చప్పగా సాగుతున్న ఈ టీ 20 ప్రపంచకప్‌లో తొలి సంచలనం నమోదైంది. పసికూన, తొలిసారి టీ 20 అంతర్జాతీయ టోర్నీలో అడుగుపెట్టిన అమెరికా, పటిష్టమైన పాకిస్థాన్ని మట్టికరిపించింది. అత్యంత ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో అమెరికా 18 పరుగులు చేస్తే, పాక్ 13 పరుగులకే పరిమితమై ఓటమి మూటగట్టుకొంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజామ్ (44), షాదాబ్ ఖాన్ (40) మాత్రమే రాణించారు. అమెరికా బౌలర్లలో కెంజిగే 3, నరoత్రవల్కర్ 2 వికెట్లు పడగొట్టారు. అమెరికా బ్యాటర్లలో కెప్టెన్ మోనాంక్ పటేల్ అర్థ సెంచరీతో రాణించాడు. ఆరోన్ జోన్స్ కూడా (25) విలువైన పరుగుల్ని అందించాడు. ఈ మ్యాచ్ లో అమెరికా ఫీల్డింగ్ లోనూ మెరిసింది. మైదానంలో చురుగ్గా కదిలిన ఫీల్డర్లు పాక్‌ని పరుగులు చేయకుండా కట్టడి చేయగలిగారు.