మాజీ మంత్రి, మాజీ వైకాపా నేత కొణతాల రామకృష్ణ వ్యూహం లక్ష్యం ఏమిటో ఎవరికీ అంతుబట్టకుండా వ్యవహరిస్తున్నారు. కొంతకాలం క్రితం, ఉత్తరాంధ్రాలో వెనుకబడిన ప్రాంతాలని ఆదుకొని అభివృద్ధి చేయాలని, ఉత్తరాంధ్రా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులని త్వరగా పూర్తి చేయాలని, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం వంటి హామీలని అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు వ్రాసి వార్తలలో కనిపించారు.
మళ్ళీ నిన్న కొంచెం హడావుడి చేసి మీడియా దృష్టిలో పడ్డారు. రెండేళ్ళయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు రక్షాబంధన్ సందర్భంగా నిన్న విన్నూత్న పద్దతిలో నిరసనలు తెలియజేశారు. విశాఖ జిల్లాలో ఆయనకి బాగా పట్టున్న కొన్ని గ్రామాలలో ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మలని ఏర్పాటు చేసి, స్థానిక మహిళల చేత ఆ బొమ్మ చేతికి రాఖీలు కట్టించి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తులు చేయించారు. ఇటువంటి నాటకీయ రాజకీయాల వలన ప్రత్యేక హోదా వస్తుందా? అంటే రాదనే అర్ధం అవుతుంది. మరి ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నట్లు అంటే ప్రజలని ఆకట్టుకొని తన ఉనికిని వారు గుర్తించేలా చేయడం కోసమేనని భావించవచ్చు.
ఒకవేళ ఆయన నిజంగా ప్రత్యేక హోదా కోరుకొంటున్నట్లయితే, ఇలాగ వీలున్నప్పుడు ఇటువంటి పనులు చేయడం కంటే, రాష్ట్రంలో దానికోసం పోరాడుతున్న పార్టీలతో, ప్రజా సంఘాలతో కలిసి పని చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కనీసం ఆ రాఖీలు కడుతున్న గ్రామీణ మహిళలకి ప్రత్యేక హోదా అంటే ఏమిటో, దాని వలన రాష్ట్రానికి వారికీ ఏమి ప్రయోజనం కలుగుతుందో వివరించినా ఆయన శ్రమకి ఎంతో కొంత ఫలితం ఉండేది. ఒకవేళ ఆయన రాజకీయాలలో కొనసాగాలనుకొంటే నిరభ్యంతరంగా తనకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరి ఎన్నికలలో పోటీ చేయవచ్చు. గెలిస్తే అధికారం చేపట్టవచ్చు. కానీ ఆ పని చేయకుండా ఈవిధంగా అగమ్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయన ఏమి ఆశిస్తున్నారో…ఆయన రాజకీయ లక్ష్యం ఏమిటో? ఆయనకే తెలియాలి.