టాలీవుడ్లో సుప్రసిద్ధ బ్యానర్లలో ఉషాకిరణ్ మూవీస్ ఒకటి. ఈ సంస్థపై కొన్ని విలువలకు కట్టుబడి సినిమాలు తీశారు రామోజీరావు. అందులో కమర్షియల్ హిట్లూ ఉన్నాయి. అవార్డు సినిమాలూ ఉన్నాయి. ఉషాకిరణ్ నుంచి దాదాపుగా 80 సినిమాలొచ్చాయి.చాలా కాలంగా.. ఉషాకిరణ్ సినిమాలు చేయడం లేదు. రామోజీరావు యాక్టీవ్‌గా లేకపోవడం, చిన్న సినిమాలకు ఆదరణ తగ్గిపోవడం అందుకు ఓకారణం. పైగా… ఈటీవీ విన్ పేరుతో ఓటీటీ ఏర్పాటు చేశారు. ఆ ఓటీటీ కోసం సినిమాలు తీయడం మొదటెట్టారు. దాంతో.. థియేటరికల్ రిలీజ్ కోసం సినిమాలు చేయడం పూర్తిగా ఆపేశారు. ఎట్టకేలకు ఉషాకిరణ్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంది. దానికి… `మ్యాచ్ ఫిక్సింగ్` అనే టైటిల్ ఖరారు చేశారు. ఇ.సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. నటీనటులు అంతా దాదాపుగా కొత్తవారే. నిజానికి ఈటీవీ విన్ కోసం ఈ సినిమా తీశారు. కానీ అవుట్ పుట్ చూశాక.. థియేటర్లోనూ విడుదల చేయాలని ఉషాకిరణ్ మూవీస్ ఫిక్సయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్లు మొదలెడతారు. ఈ సినిమా కనుక ఆర్థికంగా హిట్ కొడితే… ఉషాకిరణ్ నుంచి మరిన్ని సినిమాలు రావడం ఖాయం.