పోలీస్ క్యారెక్టర్లంటే హీరోలు పడి చస్తారు. ఎందుకంటే మాస్‌కి మాసూ, క్లాస్‌కి క్లాసూ చూపించగలిగే దమ్మున్న పాత్రలవి. అలాంటి పోలీస్ పాత్రల్లోనే మకుటం లేని మహారాజుగా నిలిచింది గబ్బర్ సింగ్. హిందీ `దబాంగ్`కి రీమేక్ అయినా, హరీష్ శంకర్ ఈ క్యారెక్టర్ ని మౌల్డ్ చేసిన విధానం, పవన్ కల్యాణ్ ఈ పాత్రలో రాణించిన పద్ధతి…. ఈ సినిమాని సూపర్ హిట్ చేశాయి. గబ్బర్ సింగ్ క్యారెక్టర్ ని ఓ లాండ్ మార్క్ గా నిలిపాయి. సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ మరో ప్రయత్నం చేసినా, అక్కడ హరీష్ లేడు. ఆ సినిమాకి బాబీ దర్శకుడు. హరీష్ లేని టోటు… సర్దార్ లో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు పవన్ మరోసారి పోలీస్ డ్రస్ వేశాడు. ఈసారి.. హరీష్ తోడయ్యాడు.
పవన్ – హరీష్ ల చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నిన్నే సెట్స్‌పైకి వెళ్లింది. ఓ ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారు. పవన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న స్టిల్ అది. పనవ్ లుక్, చేతిలో టీ గ్లాసూ, తుపాకీ చూస్తుంటే గబ్బర్ సింగ్ సెటప్ గుర్తొస్తోంది. ఇందులోనూ పవన్ వేసేది పోలీస్ డ్రస్సే కాబట్టి.. దీన్ని గబ్బర్ సింగ్ కి సీక్వెల్ అనుకొన్నా తప్పు లేదు. పవన్ ఫ్యాన్స్‌కి కూడా అదే కావాలి. పవన్ గబ్బర్ సింగ్ లా రెచ్చిపోతే చూడాలన్నది అభిమానుల ఆశ. పవన్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని హరీష్ గబ్బర్ సింగ్ లో వాడుకొన్నట్టు ఈమధ్య ఎవ్వరూ వాడుకోలేదు. భగత్ సింగ్ కి కాస్త గబ్బర్ సింగ్ గా మార్చేసినా తప్పేం లేదు. ఈసారి ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు, అంతకు మించిన అంశాలు చాలా ఉన్నాయని పోస్టర్ తోనే చెప్పేసింది చిత్రబృందం. సో… పవన్ ఫ్యాన్స్‌కి పండగే ఇక.