దానం నాగేందర్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఉన్న పదవిని పీకేశారు. దాంతో ఆయన దారి ఆయన చూసుకున్నారు. టీఆర్ఎస్లో డీల్ మాట్లాడుకునే వరకూ సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు.. అంతా అయిపోయిన తర్వాత దానంను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఫలితం ఉండదని తెలిసి కూడా.. ఓ రాయి వేశారు. ఆ ఊపులో ఢిల్లీలో రాహుల్ తో కూడా సమావేశమయ్యారు. తీరా చూస్తే.. ఇప్పుడు.. జంట నగరాలకు చెందిన మరో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అదే బాటలో ఉన్నారు. అసలు దానం పార్టీ మారినప్పుడే.. ముఖేష్ కూడా అదే బాటలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఒక్కరంటే..ఒక్కరు కూడా ముఖేష్ తో మాట్లాడి పార్టీలో ఉంచే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడాయన భారీగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారు.
ఈ వ్యవహారాలు ఇలా నడుస్తూంటే… ఎవరికి వారు.. తమ వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అందర్నీ కలిపి ఉంచాల్సిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా.. ఇందులో భాగమే. పాత వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి చెక్ పెట్టేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నించడం వివాదాస్పదమయింది. గాంధీ భవన్లో జరిగిన ఏఐసిసి కార్యదర్శల మీటింగ్ కు కత్తి వెంకటస్వామి అనే నేతను ఉత్తమ్ వెంటబెట్టుకొచ్చారు. వారందరికీ ఆయనను.. నర్సంపేట నేతగా పరిచయం చేశారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మండిపోయింది. నాలుగైదు వేల ఓట్లు కూడా తెచ్చుకోలేని వెంకటస్వామిని… తనతో పాటు గా నియోజకవర్గ స్థాయి నేతగా పరిచయం చేయడం ఏమిటని… ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. ఆయనపై దూసుకెళ్లారు. మీవల్లే పార్టీ నాశనం అవుతోందంటూ మండిపడ్డారు.
దొంతి మాధవరెడ్డిని కంట్రోల్ చేయడానికి ఎవరూ ప్రయత్నించలేదు. దీంతో కాసేపు సమావేశంలో గందరగోళం నెలకొంది. ఉత్తమ్ .. దొంతి మాధవరెడ్డికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దొంతి మాధవరెడ్డి నర్సంపేటలో బలమైన నేత. కానీ గత ఎన్నికల్లో వర్గ రాజకీయాల కారణంగా ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కత్తి వెంకటస్వామికే ఇచ్చారు. దాంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి… టీఆర్ఎస్ ప్రభంజనంలోనూ ఘన విజయం సాధించారు. తర్వాత టీఆర్ఎస్ నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ.. కాంగ్రెస్‌లోనే చేరారు. ఇప్పుడు మళ్లీ తనకు ప్రత్యామ్నాయంగా.. కత్తి వెంకటస్వామిని తీసుకురావడంతో దొంతి మాధవరెడ్డి ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేకపోయారు.
టీ కాంగ్రెస్ లో ఇప్పుడు గ్రూపుల కుమ్ములాటలు ఎక్కువైపోయాయి. ఒకరిరపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంలో బిజీగా ఉంటున్నారు. పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ పై ఈ ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. కొంత మందినే..తన వర్గం అనుకున్నవారినే ప్రొత్సహిస్తున్నారని.. రాహుల్ కు సైతం ఆరోపణలు వెల్లువెత్తాయి. బస్సుయాత్రలో కొంత మందిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించిన.. వారితో తనను కాబోయే సీఎంగా సంబోధింప చేసుకుంటున్నారన్న ఆగ్రహం కూడా ఇతర సీనియర్ నేతల్లో ఉంది. హైకమాండ్ కు వరుసగా ఫిర్యాదులు వెళ్తున్నా.. ఉత్తమ్ మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. యథా పీసీసీ..తథా నేత అన్నట్లుగా వ్యవహారం సాగిపోతోంది.