ఇది స్వీయ పరీక్ష అని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నారు! నల్గొండ లోక్ సభ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడం ద్వారా తెరాస శ్రేణులకు కొత్త ఊపు తేవాలని ఆయన అనుకుంటున్నారు. నిజానికి, నల్గొండ పార్లమెంటరీ స్థానం కాంగ్రెస్ ది. కాబట్టి, ఎన్నికల ముందే ఆ సీటు సాధించుకుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెక్ పెట్టినట్టు అవుతుందనేది కూడా కేసీఆర్ వ్యూహం. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి దాదాపు 2 లక్షల మెజారిటీతో గెలుపొందారు. అంటే, ఈ ఎంపీ స్థానం కాంగ్రెస్ కు ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు ఎమ్మెల్యే నియోజక వర్గాల్లో హుజూర్ నగర్ కు ఉత్తమ్ ఎమ్మెల్యే, కోదాడలో ఆయన భార్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి జానా రెడ్డి, నల్గొండ నుంచీ కోమటిరెడ్డి ఉన్నారు. సూర్యాపేట, దేవరకొండ, మిర్యాలగూడలు ఉన్నాయి. అంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖులంతా ఇక్కడే ఉన్నారు. కాబట్టి, ఈ ఉప ఎన్నిక నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పై పైచేయి సాధించాలన్నది కేసీఆర్ వ్యూహం.
ఇంత కీలకమైన ఉప ఎన్నికను కాంగ్రెస్ కూడా సీరియస్ గానే తీసుకుంటుంది కదా! అయితే, ఈ ఉప ఎన్నిక బాధ్యతను ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భుజ స్కందాలపైన మాత్రమే మోపాలని సీనియర్లు అనుకుంటున్నారట! ఈ ఉప ఎన్నికను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా సీనియర్ నేతలు పావులు కదిపే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. ఎలా అంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ని పీసీసీ స్థానం నుంచి దించాలనే వ్యూహం ఎప్పట్నుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ఈ మధ్య ఢిల్లీ స్థాయిలో కొంత మంత్రాంగం నడించిందనీ కథనాలు వచ్చాయి. అధినేత్రి సోనియా, యువనేత రాహుల్ ఆశీస్సులు ఉత్తమ్ కు దండిగా ఉండటంతో ఇప్పట్లో ఆయన పీసీసీ పీఠానికి వచ్చే ఢోకా లేదనే అంటున్నారు. కానీ, ఇప్పుడీ నల్గొండ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా విజయపథంలో నడిపిస్తారనే అంశంపైనే ఉత్తమ్ ను పీసీసీలో కొనసాగించాలా వద్దా అనేది తేలిపోతుందనే చర్చ లేవనెత్తుతున్నారు.
ఎలాగూ ఈ ఉప ఎన్నికలో తెరాస గెలిచే ప్రయత్నం తీవ్రంగానే చేస్తుంది. ప్రస్తుతం గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తెరాసలోనే ఉన్నారు. ఇదే పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా గులాబీ గూటికి చేరినవారాయె. దీంతో ఆ పార్టీకి ఈ నల్గొండ ఉప ఎన్నిక నల్లేరు మీద నడక అనేదే అంచనా. అదే జరిగితే వెంటనే ఉత్తమ్ మీద ఫిర్యాదుల వెల్లువ ఖాయం! ఆయన వెంటనే పీసీసీ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ ను తెరమీదికి తీసుకుని రావచ్చనేది కొంతమంది అంచనాగా తెలుస్తోంది. నల్గొండ ఉప ఎన్నిక తెరాసకు స్వీయ పరీక్ష కావొచ్చు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే.. పార్టీ నేతలందరూ కలిసి ఎలాగైనా కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రయత్నించాలి. కానీ, తెలంగాణలో విచిత్రం ఏంటంటే.. ఉత్తమ్ ఎలా గెలిపిస్తారో అని ఇతర నేతలు ఎదురుచూస్తూ ఉండటం! ఇలాంటి కలిసికట్టుతనం ఎక్కడా చూడలేమేమో!