తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేసే ప్రయత్నాల్లో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. అంతిమంగా.. నిర్ణయం తీసుకోవడమే మిగిలింది. టీఆర్ఎస్ఎల్పీ.. ..కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని విలీనం చేయడానికి అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయింది. చిన్న చిన్న సమస్యలను.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిష్కరించడమే ఇందులో ట్విస్ట్. అయితే ఆయన నేరుగా సాయం చేయలేదు.. తప్పని సరిగా చేయాల్సి వచ్చింది.
ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా..! టీఆర్ఎస్లో జోష్..!
గత నెల ఇరవై మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచారు. ఆయన అంతకు ముందు.. ముందస్తుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున గెలిచిన 19 మందిలో ఆయన ఒకరు. దీంతో… ఇప్పుడు.. ఎమ్మెల్యేల సంఖ్య అధికారికంగా పద్దెనిమిదికి తగ్గిపోయింది. అయినా పర్వాలేదు.. అందరూ ఒకే మాట మీద ఉంటే ప్రతిపక్ష హోదా నిలుస్తుంది. కానీ.. ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే… పదకొండు మంది గుడ్ బై కొట్టేశారు. మరో ఒకరిద్దరు రెడీగా ఉన్నారు. అందుకే.. పనిలో పనిగా ఉత్తమ్ రాజీనామా చేయడం.. టీఆర్ఎస్ వర్గాలకు ఫుల్ జోష్ ఇచ్చినట్లయింది.
సీఎల్పీ విలీనానికి అంతర్గత ప్రక్రియ ప్రారంభం..!
ఉత్తమ్ రాజీనామా చేసే వరకూ.. విలీనానికి.. పదమూడు మంది ఎమ్మెల్యేలు కావాలి. కానీ.. ఉత్తమ్ రాజీనామా తర్వాత ఆ సంఖ్య పన్నెండుకు తగ్గింది. ఇప్పటికే పదకొండు మంది ఎమ్మెల్యేలు… కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించి .. టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరొక్క ఎమ్మెల్యే మాత్రమే అవసరం ఉంది. ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు రెడీ అని.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఎప్పటికప్పుడు… ఆఫర్ ఇస్తూనే ఉన్నారు. మరో ఎమ్మెల్యే కూడా… అంతర్గతంగా… తన గ్రీన్ సిగ్నల్స్ పంపారని చెబుతున్నారు. అంటే… సమస్య తీరిపోయినట్లే. ఉత్తమ్ రాజీనామాతో..తమకు అతి పెద్ద ఇబ్బంది తప్పిందని టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ ఉండదు..!
అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే.. సీఎల్పీ ఉనికి లేకుండా చేయడానికి .. టీఆర్ఎస్ వేగంగా ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇప్పటికైతే.. ప్రతిపక్ష నేతగా.. భట్టి విక్రమార్కకు గుర్తింపు ఉంది. కానీ.. కాంగ్రెస్ ఎల్పీ విలీనం పూర్తయితే.. ఆ అవకాశం కూడా ఉండదు. ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటారు. అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఉండదు. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. ఎంఐఎంకి ఎడుగురు ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి… ఆ పార్టీనే… ప్రతిపక్షంగా గుర్తించే అవకాశం ఉంది. కేసీఆర్.. ఆ పని చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నది.. టీఆర్ఎస్ వర్గాల అంచనా. మొత్తానికి ఉత్తమ్ తనకు చేయాలని లేకపోయినా.. తప్పని సరిగా…టీఆర్ఎస్కు మేలు చేయాల్సి వచ్చింది.