కామారెడ్డి నుంచి కేసీఆర్‌పై పోటీకి తాను సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఒక్క రేవంత్ రెడ్డి విషయంలోనే కాదని.. కేటీఆర్, హరీష్ రావులపైనా ముఖ్య నేతలను నిలబెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌లకు గట్టి పోటీనిచ్చేందుకు సీనియర్లను రంగంలోకి దింపాలనే చర్చ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో జరిగిందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌కు వారసుడిగా ఎన్నికల బరిలో ఉన్న మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరో మంత్రి హరీశ్‌రావుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేసేలా.. టికెట్లను ఖరారు చేయాలని ఆలోచిస్తున్నారు.
రేవంత్ రెడ్డి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉత్తమ్, కోమటిరెడ్డిలు హైకమాండ్ కు ఏం చెప్పారన్నదానిపై స్పష్టత లేదు. హైకమాండ్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అంటే ఆయనకు ఈ అంశంపై సమాచారం ఉన్నట్లే్. మరో వైపు పార్టీలో మరోసారి చేరబోతున్న రాజగోపాల్ రెడ్డి గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆయన కావాలని అన్నారో.. కాంగ్రెస్ హైకమాండ్ కు అలాంటి ఆలోచన ఉందో స్పష్టత లేదు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేయడం వేరు.. సిరిసిల్ల, సిద్దిపేటల్లో ఉత్తమ్, కోమటిరెడ్డి పోటీ చేయడం వేరని ఆయన వర్గీయులు అంటన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడతారు. కానీ.. తప్పించుకోలేని పరిస్థితిని హైకమాండ్ సృష్టిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్ లో తాము బలమైన లీడర్లం అంటే..తాము బలమన లీడర్లమని చెబుతూ ఉంటారు. అలాంటి వారికి హైకమాండ్ నిజంగానే ఇలాంటి అగ్నిపరీక్షలు పెడితే నిజంగానే ఎవరి బలం ఏమిటో తేలిపోయే అవకాశం ఉంటుంది.