రాజకీయ సన్యాసం చేసేస్తా, అధికారంలోకి వచ్చే వరకూ గడ్డం తీయను… ఇలాంటి ఛాలెంజ్ లు వినీవినీ ప్రజలకు కూడా విసుగుపుట్టేసింది..! ఆ స్థాయి సవాలు అవసరం ఉందా లేదా అనే విశ్లేషణా ఆలోచనా లాంటివి ఉండనే ఉండవేమో..! తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ సవాల్ చేశారు. తెరాసకు 106 స్థానాలు దక్కకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాల్లోంచి తప్పుకుంటారా… ఈ సవాల్ స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కేసీఆర్ కు ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రైతు సమన్వయ కమిటీలు వేశారంటూ విమర్శించారు. తెరాస నాలుగేళ్ల పాలనలో చేసిందేదీ లేదనీ, అందుకే గత పాలకులపై నిందలు వేసేందుకే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇలాంటి సవాళ్లు వినడానికి బాగానే ఉంటాయి. కానీ, అధికారంలోకి రావడం అనేది… ఒక పార్టీ మీద పంతం నెగ్గించుకునే కార్యక్రమం కాదు కదా! ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చలేకపోతే, సహజంగానే మరొకరికి అవకాశం ఇస్తారు. అయితే, అధికారం కావాలనుకునేవారు ముందుగా ప్రజా సమస్యల గురించి పోరాడాలి కదా! చాలా సమస్యలున్న మాట వాస్తవమే, ముఖ్యంగా తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి గడిచిన రెండ్రోజులుగా సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతున్నారు. అయితే, ఆయన కూడా గత పాలకులదే తప్పంతా అంటున్నారు. కాంగ్రెస్, భాజపాలు దద్దమ్మలనీ, వారి చేతగాని తనం వల్లనే ఇవాళ్ల రైతులు ఇబ్బందులు పడుతున్నాయని ఆయన అంటారు! కేసీఆర్ ది చేతగాని పాలననీ, తమ పాలనలోనే రైతులకు న్యాయం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఎవరైనా ఏం చేశారన్నది మాత్రం చెప్పుకోలేకపోతున్నారు.
నిజానికి, ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం మొక్క కూడా ఉందండోయ్. అధికారంలోకి వచ్చే వరకూ గడ్డం తీయనని కూడా అప్పట్లో ఒక సవాలు చేశారు. అలానే పెంచుతున్నారు. అయితే, ఇకపై ఆయన గడ్డం జడలు కట్టాల్సిందే అంటూ అప్పట్లో తెరాస ఎంపీ కవిత కూడా కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి, అసెంబ్లీలో కాలు పెట్టినప్పుడు మాత్రమే గడ్డం తీస్తానన్నారు. ఇప్పుడేమో అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం అంటున్నారు. నిజానికి, ఆయన రాజకీయ సన్యాసం చేసినా, గడ్డాలు పెంచుకున్నా అది ఆయన వ్యక్తిగత నిర్ణయం అవుతుంది. అంతేగానీ, ఇందులో ప్రజా సమస్యలకు ప్రతీకలు ఏవి..?