చారిత్రక భవనం అయిన ఉస్మానియా ఆస్పత్రి కూల్చవద్దని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలోకి వర్షం నీరు రావడం సంచలనం సృష్టించింది. దాన్నే ఆసరాగా చేసుకుని ప్రభుత్వంపై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. గతంలో కొత్త భవనం కట్టి తీరతామన్న కేసీఆర్ మాటలను వైరల్ చేశారు. అయితే.. టీఆర్ఎస్ .. చాలా పక్కాగా ఎదురుదాడి చేసింది. తాము కడతామంటే… కోర్టులకు వెళ్లి విపక్షాలే అడ్డుకున్నాయని వారు వేసిన పిటిషన్లను వెలుగులోకి తెచ్చారు. ఇది విపక్షాలకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఉస్మానియా కూల్చివేతకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. పాత భవనాన్ని ఖాళీ చేయించి సీజ్ చేయిస్తోంది. కోర్టు చిక్కులు తొలగిపోయిన తర్వాత కూల్చివేసి కొత్తది కడతామని చెబుతోంది.
అయితే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనూహ్యంగా ఉస్మానియా భవనం కూల్చవద్దని డిమాండ్ వినిపించడం ప్రారంభించారు. ప్రత్యేకంగా ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి… మరీ చారిత్రక భవనాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో భవనం కాకుండానే ఇంకా ఆరు ఎకలా ఖాళీ ప్రదేశం ఉందని.. అక్కడ కొత్త భవనం కట్టాలని సలహా ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహా ప్రభుత్వానికి నచ్చుతుందో లేదో కానీ… టీఆర్ఎస్ వారికి మాత్రం.. రాజకీయంగా ఉపయోగపడే అంశం అయ్యే అవకాశం ఉంది. ఉస్మానియాను కూల్చకుండా.. కొత్తది కట్టకుండా.., కాంగ్రెస్ నేతలే అడ్డుకుంటున్నారనే ఆరోపణలను మరింత బలంగా చేయడానికి ఉత్తమ్ కుమార్ చాన్సిచ్చినట్లయింది.
ఉస్మానియా హెరిటేజ్ భవనమే. దాన్ని కూలగొట్టాలంటే.. సవాలక్ష నిబంధనలు ఉంటాయి. అయితే.. రాజు తల్చుకుంటే కొరడా దెబ్బలకు లోకువ ఏముంటుంది.. అలాగే ప్రభుత్వమే తల్చుకుంటే.. ఏదో విధంగా కూల్చేయగలుగుతుంది. దానికి సెక్రటేరియట్నే సాక్ష్యం. ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేసి.. కొత్తది కట్టాలంటే… కనీసం రూ. రెండు వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. సెక్రటేరియట్లా భవనం కట్టేస్తే సరిపోదు.. ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్నవి సరిపోవు. ప్రభుత్వం వద్ద అంత ఆర్థిక వెసులుబాటు ఉందా అన్నది కీలకాంశం.