గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోయింది. ఓటమికి గల కారణాలపై రకరకాల విశ్లేషణలూ లెక్కలూ నివేదికలూ అయిపోయాయి. హైకమాండ్ కూడా నివేదికలు తెప్పించుకుని పరిశీలించింది. మరో ఐదేళ్లపాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించాలన్నది చాలా స్పష్టంగా ఉంది. అయితే, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల నిర్వహణలో అవకతవకలు అంటూ ఇంకా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో ఇందిరాపార్కు దగ్గర జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ వైఫల్యాలను ఎండగడుతూ ఈ ధర్నా చేశారు.
తెలంగాణలో ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగలేదనీ, ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ తాము కోరినా ఈసీ అస్సలు పట్టించుకోలేదన్నారు. ఓటర్ల జాబితా సవరణ విషయంలో కూడా ఈసీ శ్రద్ధ పెట్టలేదనీ, సక్రమంగా ఎన్నికలు జరిగి ఉంటే ఇక్కడ ఫలితాలు ఇంకోలా ఉండేవంటూ ఆయన మాట్లాడారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో వీపీప్యాట్లను బాగానే లెక్కించారని చెప్పారు. పది వేల లోపు మెజారిటీతో గెలిచిన అభ్యర్థుల విషయంలో వీవీ ప్యాట్లను కచ్చితంగా లెక్కించే విధానం ఉండాలన్నారు. వచ్చే ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ఈవీఎమ్ లకు బదులు బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగితే మేలనే ఒక అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఉత్తమ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సరిగా లేదనీ.. వీవీ ప్యాట్లు లెక్కించలేదనీ అంటున్నారు. నిజానికి, ఈ విమర్శలకు ఇప్పుడు సమయం కాదు. ఎందుకంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు చాలా స్పష్టంగా, ఏకపక్షంగా ఉంది. ఒకవేళ తెరాసతో పోటాపోటీగా కాంగ్రెస్ తలపడిన పరిస్థితి ఉండీ, తెరాస కాస్త మెజారిటీతో బయటపడ్డ పరిస్థితి ఉన్నప్పుడు… ఎన్నికల నిర్వహణ లోపాలను కూడా ఒక కారణంగా వారు పరిగణిస్తే కొంత సబబుగానే ఉండొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి ఇతర కారణాలే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. పైగా, త్వరలో లోక్ సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. రాష్ట్ర నాయకత్వం ప్రస్తుతం దృష్టి సారించాల్సిన అసలైన అంశం అది. ఆ యాంగిల్ లో బ్యాలెట్ విధానం మళ్లీ కావాలంటూ డిమాండ్ చేస్తే బాగుంటుంది. అంతేగానీ, జరిగిపోయిన అసెంబ్లీ ఎన్నికలనే పదేపదే ప్రస్థావించి విమర్శలు చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదనే చెప్పొచ్చు.