తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా మొదలుపెట్టింది. గద్వాలలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు. నంబర్ వన్ తెలంగాణ ద్రోహి అంటే అది కేసీఆర్ అనీ, ఆయన పనైపోయిందనీ, అందుకే ముందస్తు ఎన్నికలు కొని తెచ్చుకున్నారంటూ విమర్శించారు. నిజామాబాద్ సభలో కేసీఆర్ మాటలు చూస్తే ఆశ్చర్యం కలిగిందనీ, నాలుగున్నరేళ్ల పాలనలో సాధించింది చెప్పలేకనే, ప్రతిపక్షాలపై ఏడిచారంటూ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే తెలంగాణలో యాభై శాతానికి పైగా ప్రజలు తెరాసకు అనుకూలంగా ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారనీ, ప్రతిపక్షాలు ఎవరితో పొత్తులు పెట్టుకుంటే తనకే ఫరక్ పడదని కేసీఆర్ చెప్పారని ఉత్తమ్ గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు తమ పార్టీ పెట్టుకుంటున్న పొత్తులపై ఎందుకు విమర్శలు చేస్తున్నారన్నారు? తాము ఎవరితో పొత్తులు పెట్టుకుంటే మీకెందుకు అని ఉత్తమ్ ప్రశ్నించారు. కేంద్రంలో నరేంద్ర మోడీకి కేసీఆర్ చెంచాగా మారిపోయారని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతీ ఉప రాష్ట్రపతి ఎన్నికలు… ఇలా అన్ని సందర్భాల్లోనూ కేంద్రంలోని భాజపాకి మద్దతు ఇచ్చారనీ, ముందస్తు ఎన్నికల తరువాత జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా భాజపాతోనే తెరాస పొత్తు ఉంటుందన్నారు. కాబట్టి, తెరాసకు ఓటేస్తే భాజపాకి ఓటేసినట్టే అవుతుందన్నారు ఉత్తమ్.
టీడీపీ నాయకుడు తలసాని శ్రీనివాస్ ను తెరాసలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారనీ, ఈ లెక్కల ఎవరిపై ఎవరు ఉమ్మేయాలని ఉత్తమ్ అన్నారు. మహేందర్ రెడ్డి ఏ ఉద్యమకారుడని మంత్రి వర్గంలో చేర్చుకున్నారని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ ఉద్యమించారని క్యాబినెట్ లోకి తీసుకున్నావన్నారు. తనకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా కేసీఆర్ మాట్లాడుతూ ఉంటారని ఉత్తమ్ అన్నారు. తాను ఇండియా, చైనా సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి సైనికుడిగా దేశానికి సేవలు చేస్తున్న సమయంలో…. దుబాయికి మనుషుల్ని పంపే పాస్ పోర్ట్ బ్రోకర్ గా కేసీఆర్ పనిచేసేవారనీ, అలాంటి వ్యక్తి తనను విమర్శించడమేంటన్నారు ఉత్తమ్. టీడీపీతో పొత్తు విషయమై కేసీఆర్ ఆందోళన చెందుతున్నారనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారనే చెప్పొచ్చు.
గద్వాల సభలో ఇతర కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ పై తీవ్రంగానే విరుచుకుపడే ప్రయత్నం చేశారు. వాగ్దాటిపరంగా చూసుకుంటే… కేసీఆర్ ప్రసంగాలకు ధీటుగా మాట్లాడే నేతలు కాంగ్రెస్ లో కొంత కరువే. రేవంత్ రెడ్డి సేవల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే.. ఆ లోటు కొంత తీరుతుందని చెప్పొచ్చు. మహాకూటమి కూడా లైన్లోకి వచ్చాక.. తెలంగాణలో ప్రచారం మరింత వేడెక్కే అవకాశం ఉంది.