గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ బోర్డు కాలపరిమితి గత ఏడాది డిశంబర్ 3వ తేదీతోనే ముగిసిపోయింది. కానీ పెరిగిన జనాభాకి అనుగుణంగా వార్డుల పునర్విభజన జరపడానికి మరికొంత సమయం కావాలంటూ తెలంగాణా ప్రభుత్వం ఇంత వరకు ఎన్నికలు వాయిదా వేసుకొంటూ వస్తోంది. ఈ ఏడాది నవంబర్ 15లోగా తెలంగాణా ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు గడువు ఇచ్చింది. ఒకవేళ అప్పటికీ ప్రకటించకపోయినట్లయితే తనే స్వయంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవలసి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. అంటే తెలంగాణా ప్రభుత్వానికి మరో రెండు నెలల గడువు మాత్రమే ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
జి.హెచ్.యం.సి. పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 200కి పెంచడానికి తెలంగాణా ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతవరకు అయితే దానిని ఎవరూ తప్పు పట్టేవారు కాదు. కానీ జి.హెచ్.యం.సి. పరిధిలో ఆంధ్రా నుండి వచ్చి స్థిరపడినవారే ఎక్కువగా ఉండటంతో గెలవడం కష్టమనే అభిప్రాయంతో సుమారు 13లక్షల మంది పేర్లను తొలగించినట్లు రెండు మూడు నెలల క్రితం తెదేపా, బీజేపీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కి పిర్యాదు చేసాయి. వార్డుల పునర్విభజన విషయంలోను తెలంగాణా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలకు పట్టు ఉన్న వార్డులను కుదించి, తెరాసకు పట్టు ఉన్న వార్డులను విభజించి వార్డుల సంఖ్య పెంచడం ద్వారా ఎన్నికలలో పైచేయి సాధించేందుకు తెరాస కుట్రలు పన్నుతోందని ఆ రెండు పార్టీల నేతలు ఆరోపించారు.
వారి ఆరోపణలను దృవీకరిస్తున్నట్లుగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సరిగ్గా అటువంటి ఆరోపణలే చేసారు. తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి.పరిధిలో నుండి సుమారు 17లక్షల మంది ఆంధ్రా ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని, వార్డుల పునర్విభజన , రిజర్వేషన్ల అమలు విషయంలో కూడా తెరాసకు లబ్ది కలిగే విధంగా రికార్డులను సవరిస్తోందని ఆరోపించారు. జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ కూడా ప్రభుత్వం చెప్పినట్లు చేస్తు దాని ఏజెంట్ లాగ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలపై తగిన చర్యల తీసుకోవలసిందిగా ఎన్నికల ప్రధాన అధికారిని కోరుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
“మా ప్రభుత్వం వీలయినంత త్వరగా వార్డుల పునర్విభజన చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరుకొంటోంది. కానీ అందులో చాలా సమస్యలు, అవరోధాలు ఎదురవుతున్నాయి. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన గడువులోగా అవి పరిష్కారం కాకపోయినట్లయితే కోర్టును మళ్ళీ గడువు కోరుతాము. ఒకవేళ హైకోర్టు అందుకు అంగీకరించకపోతే సుప్రీం కోర్టుకి వెళ్ళకతప్పదు,” అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొన్ని నెలల క్రితమే తేల్చి చెప్పారు. అంటే ఈ డిశంబరులోగా జి.హెచ్.యం.సి.ఎన్నికలు జరిపించే ఉద్దేశ్యం తెలంగాణా ప్రభుత్వానికి లేదని స్పష్టం అవుతోంది. కానీ, హైదరాబాద్ జంట నగరాలలో ఆంధ్రా ఓటర్లు అధికంగా ఉన్న కారణంగా ఇంకా ఎంత కాలం ఎన్నికలు వాయిదా వేయగలదు? ఆంధ్రా ఓటర్లందరినీ తొలగించి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సాధ్యమేనా? కానప్పుడు ఇంకా ఎన్నికలు వాయిదా వేయడం వలన ప్రయోజనం ఏమిటి? తెలంగాణా ప్రభుత్వమే ఆలోచించుకోవలసి ఉంటుంది.