కాంగ్రెస్ పార్టీలో ఇంటిపోరు ఇంతింత కాదు! పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డికీ, కొంతమంది ప్రముఖ నేతలకూ పొసగడం లేదనే విషయం తెలిసిందే. ఇక, నల్గొండ ఉప ఎన్నిక వస్తుందనీ, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయిస్తారనే కథనాలు రావడంతో అన్ని పార్టీలూ సిద్ధమైపోతున్నాయి. కాకపోతే, కాంగ్రెస్ కూడా సిద్ధమైంది. మిగతా పార్టీలకంటే భిన్నంగా..! ఈ ఎన్నికతో తమ సత్తా చాటుకోవాలనే వ్యూహంలో కోమటిరెడ్డి సోదరులు ఉన్నారు. నల్గొండ ఉప ఎన్నికలో తమ సత్తా ఏంటో చాటుకుని, పీసీసీ పీఠాన్ని దక్కించుకోవాలనేది కోమటిరెడ్డి అండ్ కో సిద్ధమైపోతున్నారు. ఇదే తరుణంలో ఉత్తమ్ కుమార్ కూడా ఓ ఎత్తుగడ వేశారు. అదేంటంటే.. నల్గొండ లోకసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో తానే స్వయంగా పోటీకి దిగుతానని స్వీయ ప్రకటన చేశారు!
తాను పోటీకి దిగితే ఎన్నాళ్లుగానో పక్కలో బల్లెంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులకు చెక్ పెట్టినట్టు అవుతుందని భావించారు. అంతేకాదు, దీన్లో మరోకోణం… నల్గొండ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం దక్కించిన క్రెడిట్ మొత్తం తనకే వస్తుందనీ, తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి ఎవరనే చర్చ లేకుండా అధిష్ఠానం ఆశీస్సులు సంపూర్ణంగా తనకే లభిస్తాయని కూడా ఎత్తుగడ వేశారు. నిన్నమొన్నటి వరకూ ఇదే ఆశతో ఉన్నారు. కానీ, పరిస్థితులు ఇప్పుడు కాస్త మారినట్టు తెలుస్తోంది! తానే నల్గొండ బరిలోకి దిగుతానని ఉత్తమ్ ఇప్పుడు బలంగా చెప్పడం లేదనీ, ఆ మాట ప్రస్థావించగానే.. దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడటం, ఎన్నికలూ వస్తే అప్పుడే చూద్దాం, అధినాయకత్వం చెప్పినట్టే ఎవరైనా నడుచుకోవాల్సి వస్తుందంటూ దాటవేత ధోరణిలోకి వచ్చేశారు.
ఉత్తమ్ వాయిస్ ను ఇలా మార్చింది ఎవరంటే… ఇంకెవరు, కాంగ్రెస్ నేతలే! తానే అభ్యర్థిని అని ప్రకటించుకోగానే ఉత్తమ్ పై మరోసారి రుసరుసలాడారట కోమటిరెడ్డి సోదరులు. పార్టీలో కొంతమంది సీనియర్లు కూడా ఈ ప్రకటనపై మూతి విరిచారట. అన్నీ ఆయనే నిర్ణయించేసుకుంటే తామెందుకు అన్నట్టుగా అడ్డం తిరిగారట! దీంతో ఉత్తమ్ వ్యూహం ఉల్టా అయింది. నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలన్నింటా కాంగ్రెస్ ప్రముఖులే ఉన్నారు. కానీ, వారు ఇప్పుడు ఉత్తమ్ కు మద్దతుగా నిలుస్తారనేది అనుమానంగా మారింది. నల్గొండ ఎన్నిక బరిలోకి తాను కూడా ఉన్నానంటూ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రకటించడం మరో ట్విస్ట్! దీంతో ఉత్తమ్ వ్యూహం మొత్తం ఎదురుతిరిగింది! అందుకే, ఇప్పుడు నల్గొండ ఉప ఎన్నిక గురించి ప్రస్థావిస్తే.. తరువాత చూద్దాం అంటున్నారు. ఏదేమైనా, తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు మామూలుగా లేవు! ఒకరు గెలిస్తే మరొకరు ఓర్వలేరు! ఒకరు నిలిస్తే మరొకరు వెనక్కి లాగుతారు…! ఇలాంటి కప్పల తక్కెడ నాయకులున్న పార్టీకి అధికారం ఎందుకు కట్టబెట్టాలని ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే.. వీరి దగ్గర ఏదైనా సమాధానం ఉందా..? ఉండొచ్చు… కాకపోతే, ఒక్కొక్కరిదీ ఒక్కో సమాధానమై ఉండొచ్చు!