ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ ప్రజలు చూడలేదన్నారు. దళితులకు తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. తనకు పిల్లలు లేరనీ, తెలంగాణ ప్రజలే తనకు బిడ్డలు అని అనుకుంటున్నానని ఎమోషనల్ అయ్యారు ఉత్తమ్..! కేసీఆర్ కు ప్రజలు ఓట్లేసి గెలిపించాక, తాము అత్యంత విజ్ఞతతో వ్యవహరించామనీ, ప్రజా తీర్పును గౌరవించి, తెరాస హయాంలో దళితులకు మేలు జరిగితే చాలని ఎదురుచూశామనీ.. కానీ, జరగలేదేన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దళితులతోపాటు అన్ని వర్గాలకూ అన్యాయం జరిగిందనీ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా… ఏకంగా రూ. 500 కోట్లతో ప్రగతి భవన్ నిర్మించుకున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు భాజపా, తెరాస, ఈసీలు కలిసి ప్రయత్నిస్తున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి, కనీసం ఒక్క మాదిగనుగానీ, ఒక్క మాలనుగానీ మంత్రి వర్గంలో ఎందుకు స్థానం కల్పించలేకపోయారని నిలదీశారు. ఈ వర్గాల ప్రజలకు అర్హత లేదా సత్తా ఉన్నవారు కనిపించడం లేదా అనీ, వారికి ఏమీ చెయ్యనప్పుడు ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ ఎక్కడుంది అన్నారు. ఇదో చారిత్రక సందర్భమనీ, ఇప్పుడు తెలంగాణలో మాలలూ మాదిగలూ నిశ్శబ్దంగా ఉంటే చరిత్ర క్షమించదన్నారు. అందరూ కలిసి ఎన్నికల క్షేత్రంలో కేసీఆర్ ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. దళితులకు అన్ని రకాలుగా మోసం చేశారనీ, ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు… ఇలా అన్నీ మోసాలే అన్నారు.
మొత్తానికి, ఉత్తమ్ కూడా ఎమోషనల్ గా ఎన్నికల ప్రచారానికి దిగేశారు అనుకోవచ్చు! తనకు బిడ్డలు లేరనీ, ప్రజలే బిడ్డలు అని వ్యాఖ్యానించడం ద్వారా కచ్చితంగా కొంత ఎటెన్షన్ అయితే వస్తుంది. ఇక, దళితులను దగ్గర చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను గట్టిగానే గుర్తు చేస్తున్నారు. దళిత సీఎం హామీని తెరాస నెరవేరుస్తుందని ఎవ్వరూ అనుకోలేదుగానీ… దళిత మంత్రి క్యాబినెట్ లో ఎవ్వరూ లేకపోవడం అనేది కాంగ్రెస్ కు దొరికిన బలమైన విమర్శనాస్త్రమే అనాలి. నిజానికి, తెరాసను ధీటుగా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ కావాల్సింది ఇలాంటి ఎమోషనల్ అంశాలే. ఇంకా, మున్ముందు ఎలాంటి సెంటిమెంట్స్ బయటకి తెస్తారో చూడాలి.