తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ అధ్యక్షుడి పదవి కోసం చాలామంది నాయకులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. వరుస ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడానికి నైతిక బాధ్యత తానే వహిస్తున్నా అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తీకరిస్తున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయితే… ఉత్తమ్ రాజకీయ భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఎలాంటి పాత్ర దక్కుతుంది? కేవలం ఎంపీగా మాత్రమే ఉంటారా, పార్టీలో కీలక పదవులను ఆయన పొందే ప్రయత్నం చేస్తారా..? ఇలా చాలా ప్రశ్నలు ఈ మధ్య కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఉత్తమ్ తన ప్రయత్నాల్లో తాను ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటూ, తన రాజకీయ భవిష్యత్తుకు కావాల్సిన ప్రణాళికల్ని రచిస్తున్నారని సమాచారం.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇకపై కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారనే కథనాలు చాలారోజుల కిందటే వినిపించాయి. దానికి తగ్గట్టుగానే త్వరలోనే జాతీయ పార్టీలో ఆయనకి ఏదో ఒక కీలక స్థానం దక్కే అవకాశం ఉందని వినిపిస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా నూతన కమిటీలను ఏఐసీసీ ప్రకటించబోతోంది. పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శి పదవుల నియామకాలు కూడా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. వీటితోపాటు, వివిధ రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ లను కూడా హైకమాండ్ ప్రకటిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రక్షాళన కార్యక్రమాలతోపాటు, పార్టీలో కీలక పదవుల నియామకాలు ఉన్నాయి. కాబట్టి, ఈ క్రమంలో తనకు కూడా ఒక కీలక పదవి దక్కించుకునే ప్రయత్నంలో ఉత్తమ్ ఉన్నారని సమాచారం.
ఏఐసీసీలోకి వెళ్లాలనేది ఉత్తమ్ వ్యూహమనీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై ఆయన కన్నేశారని సమాచారం. సోనియా గాంధీ ఆశీస్సులతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాహుల్ గాంధీతో కూడా సత్సంబంధాలున్నాయి. తెలంగాణలో పార్టీ గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా… పార్టీకి కట్టుబడి ఉండే నాయకుడిగా ఉత్తమ్ కి గుర్తింపు ఉంది. ఈ సానుకూలతల్ని నేపథ్యంగా చేసుకుని పార్టీలో జాతీయ స్థాయి పదవి దక్కించుకునే పనిలో ఉన్నారట..! ఉత్తమ్ ప్రయత్నాలు ఈ స్థాయిలో ఉన్నా… అంతిమంగా పార్టీ అధినాయకత్వం ఉత్తమ్ పనితీరు, అర్హతల్ని ఎలా లెక్క గడుతుంది అనేది ముఖ్యం కదా! తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడు వచ్చేస్తే… పార్టీలో ఉత్తమ్ స్థానం ఏంటనేది కూడా తేలిపోతుంది.