తెలంగాణ కాంగ్రెస్ సోమవారం ఓ జోష్ కనిపించింది . ముఫ్పై ఐదు మంది నేతలు.. చిన్నా పెద్దా అందరూ కలిసి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. వారందరి ఆధార్ నెంబర్లతో సహా కాంగ్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. వారందరూ రాహుల్ తో భేటీ అయ్యారు. ఫోటోలు దిగారు. దీనికి సీనియర్లు అందరూ హాజరయ్యారు. అంతా బాగానే ఉంది కానీ… తాను చిచ్చు పెట్టడానికి రెడీగా ఉన్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంకేతాలు ఇచ్చేశారు. తనపై పార్టీలో దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సంగతిని పార్టీ స్ట్రాటజీ మీటింగ్‌లోనే తేల్చుకుంటానని ఉత్తమ్ మీడియాతో చెప్పారు. అయినా ఇలాంటిదేమైనా ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుని బయటకు రాకుండా చేసుకుంటారు.
కానీ ముందే లోపల తేల్చుకుంటానని మీడియా ముందు బహిరంగంగా ప్రకటించడంతోనే ఉత్తమ్ కాన్సెప్ట్ అందరికీ అర్థమవుతుందని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆయన కోవర్టు అని.. కాంగ్రెస్ మెరుగుపడిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఓ రచ్చ చేసి.. పార్టీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని కాంగ్రెస్ లోని మరో వర్గం విమర్శలు గుప్పిస్తోంది. తన రాజకీయ వారసుడ్ని బీఆర్ఎస్లోకి పంపించింది చాలక.. ప్రతీ విషయంలోనూ బీఆర్ఎస్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని…. ఇటీవల కాంగ్రెస్ సోషల్ మీడియాను సైతం పోలీసుల సాయంతో ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ నేతలంటున్నారు.
అయితే ఉత్తమ్ కు మద్దతుగా ఎంత మంది ఉన్నారన్నది ఇప్పుడు కీలకం. ఆయన రాహుల్ తో జరిగే స్ట్రాటజీ మీటింగ్ లో ఇవన్నీ చెబుతారా… చెబితే రాహుల్ ఎలా స్పందిస్తారన్న దానిపై తెలంగాణ కాంగ్రెస్ లో ఇతర పరిణామాలు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు. కాస్త కోలుకుంటున్న కాంగ్రెస్ ను మళ్లీ పడుకోబెట్టే ఆపరేషన్ ప్రస్తుతం ఉత్తమ్ చేతుల్లో ఉందన్న గుసగుసలు ఆ పార్టీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.