ఎంపీగా ఎన్నికయ్యాక హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుందనే చర్చ కొన్నాళ్లు జరిగింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిని నిలబెడతారని అప్పుడే అనుకున్నా… వరుస ఎన్నికలు ఎదుర్కోవడం తమకు ఆర్థికంగా కొంత కష్టమైన అంశంగా మారిపోయిందనీ, అందుకే ఈ ఉప ఎన్నికకు తన భార్య నిలబడకపోవచ్చనే విధంగా ఆ మధ్య ఉత్తమ్ చెప్పారు. దీంతో కొన్ని కొత్త పేర్లు తెర మీదికి వచ్చాయి. కానీ, ఇప్పుడు తన భార్యనే ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున నిలబడబోతున్నారని ఆయనే ప్రకటించారు.
ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, కార్యకర్తల కోరిక మేరకు, నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్టును కొనసాగించుకోవడం కోసం తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపుతున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు ప్రియాంకా గాంధీ వస్తారన్నారు. గడచిన ఆరేళ్లలో హుజూర్ నగర్ ప్రాంతంలో తెరాస ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసింది లేదని ఉత్తమ్ విమర్శించారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాకముందే అభ్యర్థిని ఉత్తమ్ ప్రకటించేయడం కొంత ఆసక్తికరంగా మారింది.
అయితే, ఈ ఉప ఎన్నికను తెరాస కూడా అంత ఈజీగా వదులుకునే అవకాశం లేదు. ఉత్తమ్ సొంత ఇలాఖాలో తెరాసని గెలిపించాలన్న పట్టుదలతో ఉంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక బాధ్యతని మంత్రి హరీష్ రావుకి అప్పగించే అవకాశం ఉందని తెరాస వర్గాలు అంటున్నాయి. రేవంత్ రెడ్డికి కంచుకోట లాంటి కొడంగల్ నియోజక వర్గంలో ఆయన్ని ఓడించడానికి తెరాస ఏ స్థాయి ప్రయత్నాలు చేసిందో తెలిసిందే. రేవంత్ కి వెన్నుదన్నుగా ఉన్న ద్వితీయ స్థాయి నాయకుల్ని ఎన్నికల సమయంలో తమవైపు తిప్పుకుంది. ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా అలాంటి రాజకీయ ఎత్తులూ పైయెత్తులకు అవకాశం ఉందనే వాతావరణం కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక కూడా ఆసక్తకరంగా మారబోతోంది