ముందస్తు ఎన్నికలకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. సవాల్ స్వీకరిస్తున్నామనీ, ముందస్తుకు సిద్ధంగా ఉన్నామనీ అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాది కిందట తాము ఇదే మాట చెప్పామనీ, కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డామని గుర్తుచేశారు. ఆ సమయంలో సీఎం స్పందిస్తూ ఐదేళ్లు పూర్తి చేసుకుంటామనీ, ముందస్తు వల్ల ఖర్చు అంటూ మాట్లాడారన్నారు. కానీ, ఇప్పుడు ఆయన ఏ విధంగా ధోరణి మార్చారో ప్రజలు గమనించాలని ఉత్తమ్ చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.
ఇదే అంశమై వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కూడా మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన తెరాసకు ఎన్నికలకు కొత్తగానీ, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న కాంగ్రెస్ కాదన్నారు. ఈ మధ్య ఆయన ఢిల్లీ వెళ్లారనీ, మోడీ ఆయన్ని ఏమడిగారు, ఈయన ఆయనకి ఇచ్చి హామీ ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటేనే తాము ముందస్తుకు పోతామనే అభిప్రాయంతో ఉన్నట్టు సవాళ్లేంటన్నారు. మోడీ చెప్పింది కేసీఆర్ అమలు చేస్తున్నారనీ, దాన్లో భాగంగానే తాను ప్రతిపక్షాల అభిప్రాయం కూడా తీసుకున్నానని వారికి చెప్పడం కోసమే అన్నట్టుగా తమను మాట్లాడించే విధంగా చేస్తున్నారని భట్టి విశ్లేషించారు. నిజంగా ఎన్నికలకు పోయే ఉద్దేశం కేసీఆర్ కి ఉంటే, ముందుగా అసెంబ్లీని డిజాల్వ్ చేసి, గవర్నర్ కు లేఖ ఇచ్చి వెళ్తున్నా అని ప్రకటించాలన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా కూడా ముందస్తుపై స్పందించారు. అంతేకాదు, ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు ఇన్ ఛార్జ్ లను కూడా టి. కాంగ్రెస్ నియమించింది.
కేసీఆర్ సవాలు విషయమై కాంగ్రెస్ వినిపిస్తున్న వాదన బాగానే ఉంది. కేసీఆర్ ముందస్తు కోరుకుంటే, ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ వాదనకు తెరాస నుంచి సరైన కౌంటర్ కూడా వచ్చే అవకాశం లేదు. ఈ అంశంతో మోడీ, కేసీఆర్ లను లింక్ చేసే వాదనకు బలం చేకూరినట్టయింది. లోక్ సభకు కూడా ముందస్తు వస్తుందన్న సంకేతాలు కేంద్రం ఇస్తోంది కాబట్టి, అదే వాదనను ప్రధానిని కలిసి వచ్చాక కేసీఆర్ రాష్ట్రంలో వినిపించడం.. మోడీ పట్ల కేసీఆర్ తాజా వైఖరి ఏంటనేది పరోక్షంగానే చెప్పినట్టవుతోంది. ఈ పరిస్థితిని రాష్ట్రంలో కాంగ్రెస్ సమర్థంగా ప్రచారం చేసుకుని, ప్రజలకు అర్థమయ్యే విధంగా విమర్శలూ వివరణలూ ఇవ్వగలిగితే.. తెరాసను ఎదుర్కొనే పాయింటే అవుతుంది.