కేసీఆర్ హఠావో… తెలంగాణ బచావో అనే నినాదంతో తాము ఎన్నికలకు వెళ్తామని చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… అసెంబ్లీ రద్దు చేసిన దగ్గర్నుంచీ యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ని కేసీఆర్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఆపద్ధర్మ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ప్రభుత్వం రద్దయిన తరువాత కూడా ఆర్టీసీ బస్సుల మీద ముఖ్యమంత్రి, ఇతర శాఖల మంత్రుల ఫొటోలతో వివిధ పథకాల ప్రకటనలు ఇంకా ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కూడా సరిగా పట్టించుకోవడం లేదనీ, దీనిపై తాము పోరాటం చేస్తామని ఉత్తమ్ చెప్పారు. దీనిపై భట్టి విక్రమార్క నాయకత్వంలో చీఫ్ సెక్రటరీని కలిసి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అయితే, మరో రెండ్రోజుల్లో దీనిపై చర్యలు లేకపోతే… కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామనీ, అప్పటికీ మార్పు రాకపోతే సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు.
అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో ఈవీఎమ్ టెస్టింగ్ లు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేవలం జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలు పెడుతున్నారనీ, దీంతో కింది స్థాయి వరకూ సమాచారం వెళ్లడం లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారనే అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. ప్రజలకే వారి పనితీరు మీద అనుమానాలున్నాయని చెప్పారు! అందుకే, ఈవీఎమ్ చెకింగుల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇప్పటికే ఓటరు జాబితాల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం అంటూ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఓటరు జాబితా మార్పులూ చేర్పులూ కాకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ, కొన్నాళ్లు ఎన్నికల వాయిదా వేయాల్సిన అవసరం ఉందంటూ ఓపక్క కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. అయితే, ఆ అంశాన్ని ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకం అవుతుందని తాము భావించడం లేదంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసేసి, నవంబర్ లో ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టింది. మరి, ఇప్పుడు కొత్తగా కోడ్ ఉల్లంఘన, ఈవీఎమ్ ట్యాంపరింగ్ అంటూ కొత్త పోరాటం అంటున్నారు ఉత్తమ్. వాస్తవానికి, ఇలాంటి పోరాటాల కంటే ప్రచారం మీదే కాంగ్రెస్ దృష్టి పెడితే ఉత్తమం. ఎందుకంటే, కేంద్రంలో తెలంగాణలో ఎన్నికల విషయమై ఎంత సానుకూల వాతావరణం ఉందో అందరికీ తెలిసిందే కదా!