తెర వెనకగానీ, ముందుగానీ, లోపైకారీగానీ, ఇంకో రకంగా… ఇలా ఏ ప్రాతిపదిక తీసుకున్నా తెరాస, భాజపాల మధ్య దోస్తీ ఉందనే పరిస్థితి తెలంగాణలో ఈ మధ్య కనిపించడం లేదు. ఒకవేళ తెరాసకు భాజపాతో కొనసాగాలని ఉన్నా కూడా… రాష్ట్రంలో సొంతంగా ఎదగాలన్న పట్టుదలతో కమలదళం ఉంది కాబట్టి, అలాంటి పప్పులేవీ ఢిల్లీ స్థాయిలో ఉడకనీయడం లేదన్నది చూస్తూనే ఉన్నాం. పైగా, భాజపా కూడా ఇప్పుడు తెరాస వ్యతిరేకతను ఒడిసిపట్టుకోవడమే తమ ఎదుగుదలకు వేదిక అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా తెరాస, భాజపాలు దోస్తులే… ఆ రెండూ ఒకవైపు, మేమొక్కరమే మరోవైపు అన్నట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు.
హైదరాబాద్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ… ఈనెల 28న ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహిస్తామనీ, అనుమతులు కోరుతూ నాలుగు రోజుల కిందటే పోలీసులకి వినతులు ఇచ్చామనీ, ఇంతవరకూ స్పందన లేదన్నారు ఉత్తమ్. వారు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ర్యాలీ చేసి తీరతామన్నారు. ఇదే సమయంలో ఓ కీలక ప్రకటన చేస్తున్నా అంటూ… ఇప్పట్నుంచీ మేం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీతోగానీ, టి.ఆర్.ఎస్.తోగానీ ఏ విధమైన వేదికల్నీ పంచుకోమన్నారు. ఏ అంశంపై ఎవరు పిలిచినా… భాజపా, తెరాస అక్కడుంటే తాము వెళ్లేది ఉండదన్నారు. ఇంతవరకూ భాజపా తీసుకున్న కీలక నిర్ణయాలన్నింటికీ కేసీఆర్ మద్దతు పలికారన్నారు. నోట్ల రద్దు సమయంలో భాజపా రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందే ఈయన మద్దతు ఇచ్చారన్నారు. జీఎస్టీకి, ఆర్టికల్ 370 రద్దుకీ, ట్రిపుల్ తలాక్ బిల్లుకీ, రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా భాజపా అభ్యర్థికి కూడా ఇలానే మద్దతు ఇచ్చారన్నారు. కేసీఆర్ మద్దతు పలికిన భాజపా ఆర్థిక విధానాల వల్లనే ఇవాళ్ల దేశంతోపాటు రాష్ట్రం కూడా ఆర్థికంగా కుదేలయ్యే దిశలో ఉందన్నారు. ఇవన్నీ తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలన్నారు.