తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆంధ్రప్రదేశ్‌లో పాలన బాగా నచ్చుతోంది. మిగతా విషయాల్లో ఏమో కానీ..కరోనాను ఎలా కట్టడి చేయాలంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఏపీలా అనే సమాధానం చెబుతున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నిర్మోహమాటంగా… కరోనా కట్టడిపై ఏపీని చూసి నేర్చుకోవాలని సీఎం కేసీఆర్‌కు సలహా ఇచ్చేశారు. కరోనా వైద్యం సరిగ్గా అందడం లేదన్న కారణంగా భట్టి విక్రమార్క ఆస్పత్రుల పర్యటనకు వెళ్లారు. ఈ అంశంపై హైదరాబాద్‌లో మాట్లాడిన ఉత్తమ్… సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు భరించలేకపోతున్నారని .. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు భయపడుతున్నారని విమర్శించారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని గవర్నరే చెప్పారని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో కరోనా ఎక్కువ ఉందో.. తక్కువ ఉందో అంచనా వేయడం కష్టం కానీ.. ఏపీలో మాత్రం..కరోనా కంట్రోల్ తప్పిపోయిందని..అక్కడ రోజువారీగా నమోదవుతున్న కేసులు… మరణాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఏపీలో పల్లె పల్లెకు కరోనా విస్తరించింది. మెట్రో సిటీలు లేకపోయినా… అంత విస్తృతంగా కరోనా వ్యాప్తిచెందడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఏపీతో పోలిస్తే..తెలంగాణలో చాలా పరిమితంగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలోలా లక్షణాలతో పెద్ద ఎత్తున ఆస్పత్రులకు రావడం లేదు. అయితే..కరోనా అంశాన్ని హైలెట్ చేసుకోవాలుకుంటున్న టీ కాంగ్రెస్ .. కేసీఆర్ ను విమర్శించడానికి ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడమే..కాస్త వింతగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.