తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి కానీ… కనీసం పదిహేను సీట్లలో పీట ముడి పడిందని… టీ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం సోనియా నేతృత్వంలో ఎన్నికల కమిటీ భేటీ సమావేం కానుంది. సోనియాతో ఆమోద ముద్ర తర్వాత శుక్రవారం అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు.. జరిగిన అభ్యర్థుల పరిశీలనా మథనంలో… పూర్తిగా ఉత్తమ్ వర్సెస్ రేవంత్ అన్నట్లుగా సాగిందని ప్రచారం జరుగుతోంది. తనతో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన అనుచరుల కోసం.. రేవంత్ పట్టుబట్టగా… తనకు సపోర్టర్లుగా ఉంటారని భావిస్తున్న వారి కోసం ఉత్తమ్… ప్రయత్నించారు. దీంతో చాలా సీట్లలో పీట ముడి పడింది. స్క్రీనింగ్ కమిటీకి ఏం చేయాలో తోచక రెండు పేర్లతో.. కనీసం పదిహేను నియోజకవర్గాల జాబితాను… ఎన్నికల కమిటీకి పంపేశారు.
టీడీపీకి 14, టీజేఎస్‌కి 7 నుంచి 8 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు ప్రచారం జరుగుతున్నా, అవి పోటీ చేసే స్థానాలు నిర్ధిష్టంగా తేలలేదు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా అంగీకారానికి వచ్చిన సీట్లను వదిలేసి మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మెజారిటీ స్థానాల్లో ఒకే పేరును ప్రతి పాదించినప్పటికీ పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో రెండేసి పేర్లను ప్రతిపాదించినట్టు సమాచారం. గెలిచే సత్తా, సామాజిక న్యాయం, మహిళలు, యువతకు ప్రాతినిధ్యం వంటి అంశాలపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సమతూకం పాటించే ప్రయత్నం చేశారు. బీసీలకు 28 నుంచి 30 స్థానాలు కేటాయించనున్నారు. టీఆర్ఎస్ కంటే మెరుగ్గా బీసీ ప్రాతినిధ్యం ఉండేలా సంప్రదింపులు కొనసాగినట్టు సమాచారం.
మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కార్, విజయశాంతి, బలరాం నాయక్, మల్లు రవి పేర్లను స్క్రీనింగ్ కమిటీ తుది జాబితాలో చేర్చినట్టు సమాచారం. పొన్నం కరీంనగర్ నుంచి, సురేష్ షెట్కార్ నారాయణఖేడ్ నుంచి, బలరాం నాయక్ మహబూబాబాద్ నుంచి, విజయశాంతి మెదక్ నుంచి, మల్లు రవి జడ్చర్ల నుం చి పోటీ చేసేందుకు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు, అరవిందరెడ్డి మధ్య గట్టిపోటీ నెలకొంది. సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ రెండు స్థానాలపై స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చాలాసేపు కసరత్తు జరిగింది. పటేల్ రమేష్ రెడ్డి.. రేవంత్ తో పాటు.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. దామోదర్ రెడ్డి.. సూర్యాపేట నుంచి పలుమార్లు గెలిచారు.