తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నికల కోసం రకరకాల వ్యూహాలు రచిస్తున్నట్లున్నారు. కానీ వాటిలో ఏ ఒక్కటీ పనిచేస్తున్నట్లు లేదు. పార్టీ అభ్యర్ధిని ఖరారు చేయకమునుపే తన పార్టీ కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో ఎన్నికలలో గెలుస్తుందని ప్రకటించారు. అంటే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరయినప్పటికీ పార్టీ బలంతోనే గెలవగలమని ధీమా వ్యక్తం చేస్తున్నట్లుంది. బహుశః తెరాస ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందనే ఆయన దృడంగా నమ్ముతున్నందునే అంత ధీమాగా ప్రకటించారేమో? ఆ సవాలును ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వీకరించినట్లే ఉన్నారు. ఆయన కూడా ఈసారి ఎన్నికలు అభ్యర్ధుల మధ్య కాక పార్టీల మధ్యనే జరుగుతాయని ప్రకటించేశారు. దానితో ఉత్తమ్ కుమార్ రెడ్డి కంగు తిన్నారు.
ఆ తరువాత అయన మరొక ఊహించని ప్రతిపాదన చేసారు. అధికార గర్వంతో విర్రవీగుతున్న తెరాసకు బుద్ది చెప్పాలంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ (తెదేపా-బీజేపీలు తప్ప) ఒక్క త్రాటిపైకి వచ్చి పోరాడాలని కోరారు. అయితే అన్ని పార్టీలు వచ్చి కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. కానీ అది చాలా అత్యాశేనని ఆయనకీ తెలిసే ఉంటుంది. వామ పక్షాలన్నీ కలిసి గాలి వినోద్ కుమార్ ని, తెరాస దయాకర్ ని, వైకాపా తన స్వంత అభ్యర్ధిని, తెదేపా-బీజేపీలు ఉమ్మడి అభ్యర్ధిని నిలబెడుతున్నాయి. వారు కాక స్వతంత్ర అభ్యర్ధులు చాలా మంది బరిలో ఉండనే ఉంటారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సిరిసిల్ల రాజయ్య వారందరినీ ఎదుర్కొని పోరాడి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించగలరో లేదో ఫలితాలు వెలువడితే కానీ తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార పార్టీకి సవాలు విసరబోయి తన స్వంత అభ్యర్ధికే అగ్ని పరీక్ష పెట్టుకొన్నట్లయింది.
తాజాగా ఆయన మరో మాట చెప్పారు. ఈ ఎన్నికలను తాము రెఫరెండంగా స్వీకరిస్తున్నామని చెప్పారు. అయితే ఆ మాట అధికారంలో ఉన్న తెరాస చెప్పి ఉండి ఉంటే చాలా ముచ్చటగా ఉండేది. సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా అటువంటి పొరపాటు చేయదు. కనుక ప్రతిపక్షాలే ప్రతీ ఎన్నికలను రిఫెరెండంగా ప్రకటించుకొని తృప్తి పడుతుంటాయి. ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస అభ్యర్దే విజయం సాధించినట్లయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన ఈ రిఫరెండం తెరాసకు మరింత లబ్ది చేకూర్చుతుంది. కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం కలిగిస్తుంది. ఎన్నికలకు ముందు ఆయన విసిరిన ఈ సవాలును స్వీకరించడానికి తెరాస ఇష్టపడనప్పటికీ ఎన్నికలలో గెలిస్తే తప్పకుండా ఈ ‘రిఫరెండం’ విషయాన్ని హైలైట్ చేసి తమ సమర్ధమయిన పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే ఈ విజయం అని, కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ప్రజలు విశ్వసించడం లేదని గొప్పగా చెప్పుకొంటుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీయే ప్రజల ముందు తల దించు కోవలసివస్తుంది.