ఉత్తర ప్రదేశ్‌లో అఖండ విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీని తెలుగుదేశం అధినేత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. అయితే రాజకీయంగా ఈ ప్రభంజనం తమపైన ఎలాటి ప్రభావం చూపిస్తుందనేది తెలుగుదేశం వర్గాల్లో ఒకింత ఆందోళనగానే వుంది. గతంలోనే మోడీ చంద్రబాబు పట్ల పెద్ద ఆదరణ చూపించకపోగా ప్రత్యేకహౌదా వంటి విషయాల్లో నిర్లిప్తత నిరాకరణ ప్రదర్శిస్తూ వచ్చారు. సంఖ్యాపరంగా బిజెపికి పెద్ద అవకాశం లేని ఎపిపై ఆయనకు గాని అమిత్‌షాకు గాని పెద్ద ఆసక్తిలేదని ఈ నాయకులు చెబుతుంటారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వెంటపడకపోతే ఈ మాత్రం కూడా జరగదని, అయితే వెంకయ్య అన్నా మోడీకి పెద్ద ప్రాధాన్యత లేదుగనకే ఆయన శాఖ మార్చారని బిజెపి నేతలు చెబుతుంటారు. అమిత్ షా వ్యూహం ప్రకారం తెలుగురాష్ట్రాల్లో బిజెపిని స్వంతంగా బలోపేతం చేయాలంటే కేవలం చంద్రబాబుతో వున్న మైత్రి కారణంగా వెంకయ్య అడ్డుపడుతుంటారని వారి ఆరోపణ. అయినా వచ్చే ఎన్నికల కారణంగానే మోడీ పూర్తిగా తెగతెంపులు చేసుకోకుండా నడిపిస్తున్నారనేది వారి అంచనా.ఈ నేపథ్యంలో యుపి ఎన్నికల్లో గనక బిజెపి దెబ్బతింటే మోడీ దిగివస్తారని చంద్రబాబుకు మళ్లీ చక్రం చేతికొస్తుందని ఆయన అనుయాయులు ఆశపడుతుండేవారు. కాని యుపిలోనూ ఉత్తరాఖండ్‌లోనూ అనూహ్యస్థాయిలో లభించిన విజయంమోడీని మరింత బలవంతుణ్ని చేసింది.కనక స్వంత పార్టీలోనే నచ్చని నాయకులను ఆయన తేలిగ్గా పక్కనపెడతారని అనుకుంటున్నారు.
అలాటప్పుడు చంద్రబాబును కూడా పెద్దగా పిలిచి పీట వేసే అవకాశం వుండదని తేల్చిచెబుతున్నారు. పైగా ఈ ఫలితాల్లో యాంటీ ఇంకంబెన్సీకోణం చంద్రబాబు ప్రభుత్వానికి వుంటుందనే వాదనతో మరింత ఒత్తిడి తేవచ్చని చెబుతున్నారు.
ఈ స్థాయిలో కాకున్నా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కూడా ఇది పెద్ద ఇష్టపడే పరిణామం కాదు. రేపు మెజార్టి అవసరం కావచ్చనే అంచనాతో మోడీ టిఆర్ఎస్ను మంచిగా చూస్తున్నారనే అభిప్రాయం వుంది.మొదట్లోనైతే ఇంటర్వ్యూ లభించడం కూడా గగనమైపోయేది.కాని కెసిఆర్ కావాలని సానుకూల సంకేతాలు పంపించి నోట్లరద్దుపై పొగడ్తలు కురిపించి మోడీని ప్రసన్నం చేసుకున్నారు. ఇప్పుడు కూడా అభినందన పూర్వకంగా మాట్లాడారు. అయితే హిందూత్వ ప్రచారాన్ని ఉధృతం చేసిన మోడీతో మంచిగా వుండటం మజ్లిస్ మిత్రుడైన కెసిఆర్‌కు ఇబ్బందేననిమరో భావన. ఏమైనా ఇప్పుడైతే ఇద్దరు సిఎంలు మంచిగా వుండటం తప్ప మరో విధంగా మాట్లాడే పరిస్థితే లేదు.