రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. గోదావరి జిల్లాల్లో ఎవరు గెలిస్తే… ఏపీలో వాళ్లకే అధికారం..! అందులో ఏ పార్టీ గెలిస్తే.. తెలంగాణలో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది..!.. ఇలాంటివన్నమాట… ఇలాంటి సెంటిమెంటే… దేశ రాజకీయాల్లో ఒకటి ఉంది.. అదే యూపీలో ఎవరు అత్యధిక సీట్లు సాధిస్తే.. వారికే కేంద్రంలో అధికారం అనేది.. ఆ సెంటిమెంట్. ఇప్పటి వరకూ అది నిజం అవుతూ వచ్చింది. అత్యధిక సీట్లు సాధించే పార్టీకి కాకపోయినా… ఆ పార్టీకి అనుబంధాగా ఉన్న పార్టీనో.. కూటమిలో ఉన్న పార్టీనో… అధికారం చేపడుతూ వస్తోంది. ఈ సారి మోడీని దించేసి అధికారం చేపట్టాలనుకుంటున్న.. కాంగ్రెస్ పార్టీకి.. యూపీలో అసలు పోటీ చేసే పరిస్థితే లేకుండా పోయేలా ఉంది. యూపీలో మహాకూటమిగా ఏర్పడుతున్న పార్టీలు.. కాంగ్రెస్ పార్టీని లెక్కలోకి తీసుకోవడం లేదు. రెండు అంటే.. రెండు స్థానాలు అదీ కూడా.. రాహుల్, సోనియాలు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయ్ బరేలీలు మాత్రమే.. వదిలి పెడతామని… ఇష్టముంటే .. కూటమిలో ఉండమని.. లేకపోతే.. దారి చూసుకోమని.. తేల్చి చెప్పేశాయి.
ఇప్పుడు దేశం దృష్టి అంతా.. ఉత్తరప్రదేశ్‌పైనే ఉంది. ఎందుకంటే.. అక్కడ బీజేపీ కోల్పోయే సీట్లను బట్టే.. ఆ పార్టీ ఎంత ఘోర పరాజయానికి గురి కాబోతోందనేది తేలబోతోంది. మామూలుగా అయితే.. ఆ పార్టీ టెన్షన్ పడాల్సి వచ్చేది కాదు. కానీ ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటి.. ఎస్పీ, బీఎస్పీ కలిశాయి. ఫలితంగా… బీజేపీని వ్యతిరేకించే వర్గాలన్నీ ఏక తాటిపైకి వచ్చినట్లయింది. వారు కలసి పోటీ చేస్తే.. బీజేపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడటం ఖాయమని తేలిపోయింది. విడిగా పోటీ చేస్తే… బీజేపీ గెలుపు సంగతేమో కానీ.. తమ రాజీకయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది కాబట్టి… మాయవతి, అఖిలేష్ కూడా “మహాఘట్ బంధన్” ఏర్పాటుకు చొరవ చూపిస్తున్నారు. ఉపఎన్నికల్లో లభించిన విజయాలు వారిని ఉత్సాహానిస్తున్నాయి. ఈ క్రమంలో.. సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా దాదాపుగా పూర్తి చేశారు. యూపీలో ఉన్న 80 లోక్‌సభ స్థానాల్లో చెరో 37 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రెండు, ఆర్ఎల్డీకి రెండు, ఇంకా కూటమిలో చిన్న పార్టీలకు రెండు స్థానాలు వదిలేయాలని నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీని ఎస్పీ, బీఎస్పీ ఏ మాత్రం ఖాతలు చేయాలని అనుకోవడం లేదు. తాము అనవసర ప్రాధాన్యం ఇస్తే.. యూపీలో మళ్లీ కాంగ్రెస్ ఎక్కడ బలపడుతుందోనని వారి భయం. అంతే కాదు.. కాంగ్రెస్ పార్టీ అవసరం.. తమకు లేదని.. తమ అవసరమే కాంగ్రెస్ పార్టీకి ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు. మిత్రులుంటే తప్ప.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉనికి కాపాడుకునే పరిస్థితి లేదని.. అందు కోసం త్యాగాలు చేయాల్సిందేనని వారి భావన. అందుకే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్‌లలో దిమ్మతిరిగిపోయే సీట్లు అడిగి.. లేదనిపించుకుని ఒంటరిగా పోటీచేశారు. ఇప్పుడు యూపీలో కాంగ్రెస్ మిత్రుల్ని కలుపుకోవడం కోసం… రెండు సీట్లకే పరిమితం అవుతుందో..? ఏదైతే అదయిందని ఒంటరిగా బరిలోకి దిగుతుందో వేచి చూడాలి.. !