ఉత్తర ప్రదేశ్ లో రెండు దశల పోలింగ్ ముగిసింది. అయినా బీజేపీ మాత్రం ధైర్యంగా ఉండలేకపోతోంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో 80 లోక్ సభా స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 71 చోట్ల గెలిచింది. మిత్రపక్షాలు మరో రెండు చోట్ల గెలిచాయి. మొత్తంగా యూపీలో ఘనమైన చరిత్ర ఉన్న ఎస్పీ, బీఎస్పీ ఘోరపరాజయం పాలయ్యాయి. ఇప్పుడీ పార్టీలన్నీ కలసి పోటీ చేస్తున్నాయి. ఆర్డీఎల్డీ లాంటి పార్టీలు కూడా కలిశాయి. కాంగ్రెస్ మాత్రం విడిగా పోటీ చేస్తోంది.
బీజేపీకి వ్యతిరేకంగా మెజార్టీ సామాజికవర్గాలు ఏకం..!
ఉత్తరప్రదేశ్ రాజకీయం పూర్తిగా కుల సమీకరణాల మీదే నడుస్తుంది. దళిత, ముస్లిం, యాదవ సమీకరణాలు బీజేపీని టెన్షన్ పెట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో గుజరాత్ మోడల్ అభివృద్ధి ప్రచారం ప్రజలను ఆకట్టుకుంది. మతంతో సంబంధం లేకుండా ముస్లింలు బీజేపీకీ ఓటేశారు. దళితుల ఓట్లు చీలిపోవడంతో బీజేపీ లబ్ధి పొందింది. యాదవులు సైతం తమ సంప్రదాయ పార్టీ ఎస్పీకి ఓటెయ్యకుండా బీజేపీ పక్షాన వహించారు. ఎన్నికల తర్వాత ఆయా సామాజిక వర్గాలు ఆశించిందీ జరగలేదు. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవకాశాలు కనిపించలేదు. యూపీలోని 80 లోక్ సభా నియోజకవర్గాల్లో దళితులు, యాదవులు, ముస్లింలు కలిసి యాభై నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో అజిత్ సింగ్ నేతృత్వంలో జాట్ పార్టీ రాష్ట్రీయ లోక్ దళ్ .. ఆర్ఎల్డీ.. విడిగా పోటీ చేసి భంగపడింది. తర్వాత తప్పు తెలుసుకుని బీజేపీ వ్యతిరేక కుటమిలో చేరింది. కైరానా ఉప ఎన్నికల్లో ఆర్ఎల్డీ తన సత్తా చాటింది. ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ- బీఎస్పీ, ఆర్ఎల్డీ కలిసి పోటీ చేస్తున్నాయి.
అటు మోడీ.. ఇటు యోగి..! ప్రజలకు తిప్పలే తిప్పలు..!
సామాజిక వర్గాలు లెక్కలేసుకోకుండా పోటీ చేసినప్పుడు బీజేపీ విజయం సాధించింది. అందరూ కలిసి ఒకటిగా కమలంపై తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. ముస్లిం, దళిత, యాదవ, ఓబీసీ వర్గాలలో ఎక్కువ మంది పేదరికంలో మగ్గుతున్నారు. రైతులు నానా తంటాలు పడ్డారు. చెరకు సహా అందరూ రైతులకు గిట్టుబాటు ధర అందలేదు. అన్నదాతలకు ఆరు వేల రూపాయల పథకాన్ని ప్రవేశ పెట్టారు. అది ఏ మూలకు చాలదని విమర్శలు వస్తున్నారు. చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వారు, వ్యాపారులు నష్టాల ఊబిలో ఇరుక్కున్నారు. పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ వారి నడ్డి విరించింది. వ్యాపారులు ఇంకా కోలుకోకముందే ఎన్నికలు వచ్చాయి. విద్యా, వైద్య రంగాన్ని సంస్కరించే పరిస్థితి కూడా కనిపించలేదు. ప్రభుత్వ విధానాలు కూడా ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. గో సంరక్షణ పేరుతో దాడులు జరుగుతున్నా సర్కారు చూసీ చూడనట్లుగా ఊరుకుంది. దాడులను ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం అనుమానంతో దాడులు చేస్తున్నారని ముస్లిం వర్గాలు మొరపెట్టుకున్నా వినిపించుకున్న నాథుడు లేడు. ఇతక దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు కూడా ఆపలేకపోయారు. కొందరు బీజేపీ నేతల ప్రకటనలు కూడా దళితుల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకతకు కారణమైంది. పైగా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మార్చి జనాన్ని ఇబ్బంది పెట్టేందుకు చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది.
బీజేపీకి 20 వచ్చినా గొప్పేననేలా పరిస్థితులు..!
ఇప్పుడు మూడు ప్రధాన సామాజిక వర్గాలు చేతులు కలిశాయి. ఓట్లు బదిలీ అవుతుందా అన్న ప్రశ్నకు కూడా ఉప ఎన్నికల్లో సమాధానం దొరికింది. దళిత పార్టీగా పేరు పొందిన బీఎస్పీ, యాదవ పార్టీగా పేరు పొందిన ఎస్పీ, జాట్ల పార్టీగా పేరు పొందిన ఆర్ఎల్డీ, వారందరికీ మద్దతిస్తున్న ముస్లిం సామాజిక వర్గాలు ఇప్పుడు ఒకటయ్యాయి గతంలో మాదిరిగా కాకుండా దళితుల ఓట్లు ఇతర సామాజిక వర్గాల పార్టీలకు బదిలీ అయ్యే ఛాన్సుందని తాజా విశ్లేషణలు, సమీకరణాలు చెబుతున్నాయి. దీని వల్ల యూపీలో అత్యధిక స్థానాలు ఇప్పుడు విపక్ష కూటమి గెలుచుకునే వీలు కూడా ఉంది. అందుకే… 80 సీట్లలో బీజేపీ స్కోర్ ను 20 దగ్గరే ఆపేస్తున్నాయి ప్రజాభిప్రాయసేకరణలు.