ఊహించని.. ఊహించలేని ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉంటాయో హాలీవుడ్ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు రియల్‌గా జరుగుతూ ఉంటాయి. ఉత్తరాఖండ్‌లో ఆదివారం అలాంటి విపత్తే చోటు చేసుకుంది. అప్పటి వరకూ నిర్మలంగా ఉన్న ధౌలి గంగ నది ఒక్క సారిగా విరుచుకుపడింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే …సమీపంలో ఉన్న వారందరూ కొట్టుకుపోయారు. డ్యాములకు డ్యాములు రూపురేఖలు కోల్పోయాయి. పవర్ ప్లాంట్లు ఆనవాళ్లు లేకుండా పోయాయి.
ఉత్తరాఖండ్ కూడా.. హిమాచల్ ప్రదేశ్ , కశ్మీర్ తరహాలోనే పర్వతాల రాష్ట్రం. అక్కడ మంచు పర్వతాలు ఎక్కువే. హిమానీ నదాలు మెల్లగా కరుగుతూ ఉంటాయి. కానీ అది ఒక్క సారిగా ఆ హిమానీ నదం విరిగిపడటంతో వరదలు వచ్చేశాయి. ఈ వరదల కారణంగా తపోవన్లోని రుషి గంగ పవర్ ప్రాజెక్టు నీటమునిగింది. అందులో పని చేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. పదహారు మందిని ఓ చిన్న గుంత నుంచి కాపాడారు. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో జోషీమఠ్-మలరి వంతెన కొట్టుకుపోయింది. భారత సైన్యం సరిహద్దు ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ వంతెన ఉపయోగిస్తున్నారు.
2013లో ఇలాంటి వరదలే వచ్చాయి. అప్పుడు వరదలు వచ్చిన చోట ఇప్పుడుకూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అలకనంద ప్రాంతంలో వరదలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరీవాహక ప్రాంతాల వెంబడి నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైన్యాన్ని రంగంలోకి దించారు. దిగువన ఉన్న శ్రీనగర్, హృషికేశ్ డ్యామ్‌లను ఖాళీ చేయించారు. దిగువన ఉన్న ఉత్తరప్రదేశ్ కూడా అలర్టయింది. గంగానది పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రకృతికి మానవాళి చేస్తున్న హాని కారణంగానే ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తున్నాయనేది అందరికీ తెలిసిన విషయం. పదే పదే అందరూ చెప్పే విషయం. ప్రభుత్వాలు కూడా అంగీకరించే అంశం. కానీ ఈ విషయంలో ఎప్పుడూ తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేయరు. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతారు. దాని వల్లే ఇలాంటి ప్రకృతి విపత్తలు వస్తున్నాయి.