రాఖీ పౌర్ణమి. ఇప్పుడు ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా ప్రాచుర్యం పొందిన పండుగ. విదేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్న సోదరులకు పోస్టులో లేదా కొరియర్లో ఆడపడుచులు రాఖీలు పంపుతారు. ఇక, కాస్త దూరమైనా అదే రోజు రాఖీన స్వయంగా కట్టాలని మరికొందరు ఆడపడుచులు భావిస్తారు.
తమ సోదరులకు రాఖీలు కట్టడానికి ఎక్కడెక్కడో ఉన్న ఆడపడుచులు బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అలాంటి వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం లభించింది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఉత్తరాఖండ్ లో ఆడపడుచులకు ఇది ప్రభుత్వం ఇచ్చే రాఖీ కానుక అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ ప్రకటించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం ఆ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఆర్టీసీ బస్సులో వెళ్లినా మహిళలకు టికెట్ ఉండదు. ఉచితంగా ప్రయాణించ వచ్చు. వ్యయ ప్రయాసలకు ఓర్చి సోదరులకు రాఖీ కట్టడానికి వెళ్లే మహిళలకు తమ ప్రభుత్వం ఈ సదుపాయం కల్పించినట్టు తెలిపారు. మహిళలందరికీ ఆయన పండుగ శుభాకాంక్షలు కూడా చెప్పారు.