ఆ మధ్య తెలుగులో ఓ సినిమా వచ్చింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని. మాది విభిన్నమైన పార్టీ బీజేపీ వాళ్లు అంటే ఔనేమో అనుకున్నారు జనం. వాళ్ల మాటలకు అర్థాలే వేరులే అని మెల్లమెల్లగా అర్థమవుతోంది. ఉత్తరాఖండ్ లో స్వయంగా చేయికాల్చుకున్న మోడీకి ఇప్పుడు కోలుకోలవడానికి కొంత సమయం పట్టవచ్చు.
కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన 9 మంది ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కమలనాథులు పాపం బాగా కష్టపడ్డారు. ఇలాంటి సంక్షోభాలను ఎన్నో చూసిన కాంగ్రెస్ తన మార్కు చక్రం తిప్పింది.
అంతే, రెబెల్స్ పై అనర్హత వేటు పడింది. ఫిరాయింపుదారులపై స్పీకర్ అనర్హత వేటు వేసిన తర్వాత దాన్ని కోర్టులు కొట్టివేయడం సాధ్యం కాదని కాంగ్రెస్ నాయకులు ధీమాగా బలపరీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో కమలనాథులు కొత్త అస్త్రం సంధించారు. అదే, రాష్ట్రపతి పాలన.
ఆ రాష్ట్రంలో పరిపాలన సజావుగా జరిగేలా లేదంటూ గవర్నర్ హటాత్తుగా కేంద్రానికి ఓ నివేదిక పంపారు. రాత్రికి రాత్రే మోడీ కేబినెట్ దానిపై చర్చించి, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది. దీనికి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. మరీ దారుణం ఏమిటంటే, మార్చి 28న అసెంబ్లీలో హరీష్ రావత్ విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది. 27వ తేదీన రాష్ట్రపతి పాలన విధించారు. కనీసం అసెంబ్లీలో బలనిరూపణకు కూడా అవకాశం ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కొన్ని బీజేపీ మిత్రపక్షాలు కూడా ఈ వైఖరిని విమర్శించాయి. ప్రజల్లోనూ బీజేపీ చులకన అయింది.
రాష్ట్రపతి పాలనపై న్యాయ పోరాటం అనేక మలుపులు తిరిగింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు వెళ్లడం, మధ్యంతర ఉత్తర్వులు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం బలపరీక్ష జరిగింది. ఇందులో హరీష్ రావత్ నెగ్గినట్టు బుధవారం సుప్రీం కోర్టు ప్రకటించింది. దీంతో మరోసారి రావత్ నాయకత్వంలో కాంగ్రెస్ పాలనకు మార్గం సుగమమైంది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో మోడీ, అమిత్ షా జోడీ వ్యూహాత్మక తప్పిదాలు అడుగడుగునా కనిపిస్తాయి. 9 మంది కాంగ్రెస్ రెబల్స్ తమ గూటికి వచ్చినప్పుడు తొందరపడటం మొదటి తప్పు. ఇంకా ఎవరైనా వస్తున్నారా లేదా ఆరా తీయలేదు. ఎవరూరావడం లేదన్నప్పుడు ఈ రెబెల్స్ తో ఏమీ సాధించలేమని అర్థమై ఉండాలి. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించకుండా ఉండాల్సింది. రెబెల్స్ పై అనర్హత వేటు పడగానే రాష్ట్రపతిపాలన విధించడం అధికార దుర్వినియోగమే అనే విమర్శను తిప్పికొట్టడం బీజేపీకి చాలా కష్టం. కచ్చితంగా కమలనాథులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని చాలా మంది నమ్ముతున్నారు.
నైతికంగా, రాజకీయంగా ఇది బీజేపీకి పెద్ద షాక్. కోరి కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే. కాంగ్రెస్ కంటే భిన్నమైన పార్టీ అయినప్పుడు కాంగ్రెస్ తరహాలోనే ఎందుకు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు? తిరుగుబాటును రెచ్చగొట్టి, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేయడానికి ఎందుకు ప్రయత్నించారు? ఇంకా ఇలాంటి అనేక ప్రశ్నలకు బీజేపీ జవాబు చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా మోడీ, అమిత్ షాలు పార్టీ నేతలకు, కార్యకర్తలకు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
లోక్ సభ ఎన్నికల్లో యూపీఏపై సునామీలా ఎగసిపడ్డ ప్రభుత్వ వ్యతిరేకత మోడీకి కలిసి వచ్చింది. ఆయన ఇమేజి కూడా తోడై ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత నాలుగైదు రాష్ట్రాల్లో విజయాలు లభించగానే అంతా మోడీ మేజిక్ అనుకున్నారు. అత్యుత్సాహంతో, అతి విశ్వాసంతో ఢిల్లీలో వ్యూహాత్మకంగా తప్పటడుగులు వేసి బొక్కబోర్లా పడ్డారు. హర్షవర్ధన్ ను కాదని మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి చెయ్య కాల్చుకున్నారు. బీహార్లో సుశీల్ మోడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా మరో ఘోర తప్పిదం చేశారు. ఫలితంగా బీహారీ, బాహరీ అనే నినాదంతో నితీష్ కుమార్ మూడోసారి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని అనైతికంగా కూల్చివేసే ప్రయత్నం చేసిందనే ముద్ర బీజేపీ ప్రతిష్టను మసకబారుస్తుంది. భవిష్యత్తులో ఇలాగే కాంగ్రెస్ తరహా తప్పటడుగులు వేస్తారా లేక నిజంగానే భిన్నమైన పార్టీగా నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తారా అనేది మోడీ బృందం తేల్చుకోవాలి.