పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ వద్ద లిఫ్ట్ పెట్టి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు పంపుతున్నట్టే తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపల్లి వద్ద కూడా లిఫ్ట్ పెట్టి విశాఖపట్టణం వరకూ సాగునీరు, తాగునీరు ఇవ్వాలన్న డిమాండ్ ఉత్తరాంధ్రలో మొదలైంది. పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వ చేయవలసిన పనిని పట్టిసీమ ఎత్తిపోతల పధకం చేస్తున్నట్టే ఎడమకాల్వ పనిని పురుషోత్తపల్లి ఎత్తిపోతల పధకం చేయాలని ఇరిగేషన్ శాఖలో రిటైర్ట్ డిప్యూటీ సూపరిటెండెంటింగ్ ఇంజనీర్ కె సూర్యప్రకాశరావు అంటున్నారు.
సహజవనరుల కేటాయింపు, పంపకాలలో ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ఉమ్మడి రాష్ట్రంలో , అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయాలు నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగుతున్నాయని ఆప్రాంతం రిటైర్డ్ ఇంజనీర్లు, అధికారులు, ప్రొఫెసర్లు , ఆలోచనా పరులు, మేధావులు గతంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సొసైటీ విశాఖలో నిర్వహించిన సదస్సులో వివరించారు. ఏలబ్దినైనా ఏపధకాన్నయినా ఉభయగోదావరిజిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలే ఎగరేసుకుపోతున్న పరిస్ధితి వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు ఎప్పటికీ వెనుకబడే వుంటున్నాయని ఆ సదస్సులో విశ్లేషించారు.
అధికార పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, మృణాలిని, గంటా శ్రీనివాసరావు మొదలైన శక్తివంతులు ఉత్తరాంధ్రా వారే అయినా జన జీవనాన్ని అభివృద్దిలోకి నడిపించే నీటి వనరుల గురించి పట్టించుకోవడంలేదని ప్రకాశరావు వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టువల్ల సమస్యలు పరిష్కారమౌతాయికదా అన్నపుడు ” నిధుల కొరత లేకుండా నిరంతరం పనిజరిగితే కనీసం అఆరేళ్ళు పడుతుంది. పోలవరం ప్రాజెక్టు ఈ పనులకు సంబంధించి 2,400 అడుగుల పొడవున 300 అడుగుల లోతులో ట్రెంచ్ తవ్వి కాంక్రీట్ వేసి డయాఫ్రంవాల్ కట్టడానికి రెండేళ్లు పడు తుంది. ఇంకా కాపర్ డామ్ నిర్మాణానికి ఒక ఏడాది, రాక్‌ఫిల్ డామ్‌కు రెండేళ్లు, స్పిల్‌వేకు రెండేళ్లు, గేట్లు ఏర్పాటు చేయడానికి ఏడాది మొత్తంగా ప్రాజెక్టు పూర్తి కావాలంటే కనీసం ఎనిమిదేళ్లుపడుతుంది. ఆధునిక టెక్నాలజీలతో 3 షిఫ్టులూ పనిచేసినా కూడా ఐదారేళ్ళకు తగ్గదు..పైగా మనకి నిధులు కూడా లేవు” అని ఆయన వివరించారు.
ఎవరు ఏమి చెప్పినా పోలవరం ప్రాజెక్టు రాష్ట్రప్రభుత్వం చేతుల్లోలేదు. ఇది గమనించే చంద్రబాబు కేంద్రంకోసం ఎదురు చూడకుండా 1800 కోట్ల రూపాయలతో పట్టిసీమ పధకం ద్వారా కృష్టా డెల్టాకు నీరిస్తున్నారు. అదే ప్రత్యామ్నాయాన్ని పురుషోత్తపల్లి ఎత్తిపోతల ద్వారా విశాఖకూ అమలు చేయాలని కోరారు. ఆయన సూచించిన ప్రత్యామ్నాయం ప్రకారం…
”ముఖ్య మైన నదులు వాగులు పంపా, తాండవ, వరహా, మామిడిగెడ్డ లమీద అక్విడెక్టులు, జాతీయ రహదారి క్రాసింగ్‌లపై ఎనిమిది వంతెనలు నిర్మించాలి. 2018 జూన్ నాటికి పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎడమ కాలువ పనులను తొలి దశలో 58 కిలోమీటర్ల వరకు పూర్తి చేసి ఏలేరు నదిలోకి నీరు వదిలి ఆయకట్టులోని 70వేల ఎకరాలకు నీరు అందించాలి. దీనివల్ల ఏలేరు జలాశయంలో మిగలనున్న దాదాపు 10 టిఎంసిల నీటిని విశాఖ పట్నం తరలించ వచ్చు. రెండో దశలో 58 కిలో మీటర్ల నుంచి 162 కిలో మీటర్ల (ఏలేరు రివర్ క్రాసింగ్ నుంచి తాళ్ల పాలెం) వరకూ పనులు పూర్తి చేశాక ప్రస్తుత ఏలేరు నీటి సరఫరా కాలువ ద్వారా చేయవచ్చు.
గోదావరి నీరు వర్షాకాలంలో ఆరు నెలలు మాత్రమే లభిస్తుంది. మిగిలిన కాలానికి కావాల్సిన 10 టిఎంసిల నీటిని నిల్వ చేసి వర్షాల్లేని కాలంలో నీరు సరఫరా చేసేందుకు 8 ట్రాన్సిట్ /మధ్యంతర రిజర్వాయర్లను 2018 జూన్ నాటికి పూర్తి చేయాలి. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నా నికి నీరు సరఫరా చేస్తే ప్రస్తుతమున్న ఏలేరు కాలువను పూర్తిగా ఇరిగేషన్ కాలువ గా మార్చి,ఏలేరు, పోలవరంఎడమ కాలువల మధ్య నున్న లక్ష 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయ వచ్చు. విశాఖ ప్రజల తాగునీటి, పారిశ్రా మికనీటి అవసరాలను తీర్చ వచ్చు. ఈ పనులన్నీ 15 వందల కోట్ల రూపాయలతో పూర్తి చేయవచ్చు.” అని వివరించారు. ఉత్తరాంధ్రప్రాంతం లో ఎందరెందరో రిటైర్ట్ ఇరిగేషన్ ఇంజనీర్లు సుళువైన ప్రత్యామ్నాయాలను సూచించగలరనీ ప్రభుత్వానికి ఈ ప్రాంతం అభివృద్ది మీద దృష్టే తప్ప నిధుల కొరత సమస్య కాదని సూర్య ప్రకాశరావు వ్యాఖ్యానించారు.
నీటివనరులకు బాధితులు / నష్టపోతున్న వారి సమస్యలు, కష్టాలు, ప్రత్యామ్నాయాలు వినడానికి కూడా లబ్దిదారుల ప్రాంతాలవారు ఇష్టపడరు. పైగా ప్రాంతీయ విబేధాలు తీసుకురావద్దని హెచ్చరిస్తారు..నీతులు బోధిస్తారు. పాలకులు ఇదేమీ గమనించనట్టే నటిస్తారు. ప్రపంచమంతా జలవనరుల కథ ఇలాగే వుంటుంది.