సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నాగశౌర్యకు ‘ఛలో’ ఆ లోటు తీర్చింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా జనాలను ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులకు అలవాటైన ఫార్ములాకు కామెడీ టచ్ ఇచ్చి ఈ సక్సెస్ కొట్టాడు కొత్త దర్శకుడు వెంకీ కుడుముల. త్రివిక్రమ్ దగ్గర ‘అ ఆ’కు పని చేసిన ఈ కుర్రాడి రైటింగ్ స్కిల్స్, కామెడీ స్టైల్ ఇండస్ట్రీ జనాలను ఆకర్షించింది. అసలే ప్రామిస్సింగ్ దర్శకులు దొరకడం కష్టం అయిందేమో వెంకీ కుడుములపై కర్చీఫ్ వేయడానికి పలువురు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. వెంకీ మనసులో మాత్రం రెండు ఆప్షన్స్ ఉన్నాయట. యువి-జీఏ2 ఒకటి, హారికా అండ్ హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరొకటి.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రభాస్ స్నేహితులు ప్రమోద్, వంశీ కలిసి యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 సంస్థలపై ‘భలే భలే మగాడివోయ్’ను నిర్మించారు. అందులో సినిమా చేయమని వెంకీ కుడుములకు ఆఫర్ వచ్చిందని టాక్. త్రివిక్రమ్ దగ్గర వెంకీ కుడుముల సహాయ దర్శకుడిగా పని చేసిన ‘అ ఆ’ను హారికా అండ్ హాసిని సంస్థ నిర్మించింది. అక్కడ నుంచీ సినిమా చేద్దామని కబురు వచ్చిందట. ఈ యువ దర్శకుడు నెక్స్ట్ సినిమా ఎవరికి చేస్తాడో?