బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు విజయ్ ‘వారసుడు’ , అజిత్ ‘తునివు’ సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. తాజాగా మరో రెండు సినిమాలు కూడా ఈ లిస్టులో చేరాయి. సంతోష్ శోభన్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘కళ్యాణం కమనీయం’ అనే సినిమా సంక్రాంతి కే విడుదల చేస్తున్నారు. జనవరి 14న ఈ సినిమాకు ఖరారు చేశారు. అలాగే జనవరి 14నే సంక్రాంతి కానుకగా ‘వివాహం’ అనే ఓ చిన్న సినిమా కూడా రాబోతుంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు.
‘కళ్యాణం కమనీయం’, ‘వివాహం’ ఈ రెండు కూడా చిన్న సినిమాలే. ‘కళ్యాణం కమనీయం వెనుక యూవీ క్రియేషన్స్ వుంది. అయితే భారీ పోటి వున్న సంక్రాంతికి రావడం అంత తెలివైన నిర్ణయం కాదు. ప్రస్తుతం థియేటర్ ఈక్వేషన్ మారిపోయింది. సినిమా బావుంటే పది రోజుల తర్వాత కూడా రన్ అందుకుంటుదని భావించే రోజులు ఎప్పుడో గడిచిపోయాయి. ఒకవేళ సినిమాకి మొదటి రోజే మంచి టాక్ వచ్చిన తొలి వారం పెద్ద సినిమాలు చూడటానికే ఇష్టపడతారు కానీ ప్రేక్షకుల చూపు ఇటు వుండదు.
ఇటివల దసరాకి వచ్చిన స్వాతిముత్యం సినిమాకి కూడా ఇదే జరిగింది. సినిమా చాలా బావుంది. అందరూ మెచ్చుకున్నారు. అయితే దసరాకి చిరంజీవి, నాగార్జున సినిమాలు బాక్సాఫీసు వద్దకు వచ్చాయి. ఆ సినిమాల రిజల్ట్ ఎలా వున్న తొలి వారం ఆ రెండూ సినిమాల చూట్టే బజ్ నడిచింది. స్వాతిముత్యం కనుక మరో డేట్ కి వచ్చివుంటే ఫలితం ఇంకా బావుండేది. ఇప్పుడు సంక్రాంతికి ఇంకా గట్టిపోటి వుంది. మరి యూవీ క్రియేషన్స్ నమ్మకం ఏమిటో.