బ్రాండ్ ని ఎలా మార్కెట్ చేసుకోవాలో యూవీ క్రియేషన్స్‌కి ఇప్పుడు అర్థమైనట్టుంది. యూవీ క్రియేషన్స్ అంటే… భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్స్. ఈ సంస్థ నుంచి సినిమా వస్తోందంటే కచ్చితంగా స్టార్స్ తో తళతళలాడుతుందని ఫిక్సయిపోవొచ్చు. అయితే ఇప్పుడు అనూహ్యంగా చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది యూవీ. ఇటీవల శోభన్ తో `ఏక్ మినీ కథ` తెరకెక్కించింది. ఆ సినిమా కేవలం రెండున్నర కోట్లతో తీస్తే.. ఏకంగా తొమ్మిది కోట్లకు అమ్ముడుపోయింది. దానికి కారణం… యూవీ క్రియేషన్స్ అనే బ్రాండ్ వాల్యూనే. దాంతో.. చిన్న సినిమాలు తీయడంలో ఉన్న మజా.. యూవీకి తెలిసొచ్చింది. `ఏక్ మినీ కథ`కు కథ అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీతోనే మరో కథ రెడీ చేయించి త్వరలో పట్టాలెక్కించబోతోంది. ఇది కూడా.. `ఏక్ మినీ కథ`లా బోల్డ్ సినిమానే.
ఈలోగా.. మారుతితో ఓ ప్రాజెక్టు ఫిక్స్ చేసింది. ఇందులోనూ సంతోష్‌నే హీరో. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. కేవలం 30 రోజుల్లో సినిమాని పూర్తి చేయాలన్నది టార్గెట్. ఈ సినిమా బడ్జెట్ రెండుకోట్ల లోపే. అయితే విచిత్రం ఏమిటంటే.. ఈసినిమా బేరం ముందే కుదిరిపోయింది.`ఆహా` ఓ ఫ్యాన్సీ రేటుతో ఈ సినిమాని కొనేసిందని తెలుస్తోంది. ఆహా ఇచ్చిన రేటు.. బడ్జెట్‌కి మూడు రెట్లు ఎక్కువ అని సమాచారం. అంటే.. యూవీకి ముందే లాభాలొచ్చేశాయన్నమాట. వచ్చిన లాభాల్లో సగం సగం పంచుకోవాలన్నది మారుతి – యూవీ మధ్య ఉన్న ఒప్పందం. అలా చూస్తే… మారుతి వాటా 2 కోట్ల వరకూ ఉంది. నెల రోజుల్లో రెండు కోట్లంటే.. మారుతికీ ఇది భలే మంచి బేరమే.