రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయాలని యూవీ క్రియేషన్స్ ఎప్పటి నుంచో అనుకుంటోంది. చరణ్ కోసం కొన్ని కథల్ని ప్రిపేర్ చేయడం, చరణ్ కి వినిపించడం జరిగాయి. అయితే చరణ్ దేనికీ ఓకే చెప్పలేదు. అయితే యూవీ ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. చరణ్ కోసం కొత్త కథలు అన్వేషిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఓ కథని చరణ్ లాక్ చేశాడని సమాచారం.
ప్రస్తుతం `ఆర్.ఆర్.ఆర్`తో బిజీగా ఉన్నాడు చరణ్. మరోవైపు ఆచార్య ఉంది. ఆ తరవాత శంకర్ సినిమా పట్టాలెక్కిస్తాడు. శంకర్ తరవాత ఎవరితో అనే సందిగ్థం ఎప్పటి నుంచో ఉంది. దానికి దాదాపు తెరపడినట్టే. అనిల్ రావిపూడి చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేశాడు. అది యూవీకి నచ్చింది. చరణ్‌కి కూడా ఈ కథ వినిపించడం జరిగింది. ఈ కథ చేయడానికి చరణ్ కూడా సిద్ధంగానే ఉన్నాడని టాక్. శంకర్ తో సినిమా తరవాత… ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని చేయాలనుకుంటున్నాడు చరణ్. దాన్ని అనిల్ రావిపూడి అయితే బాగా హ్యాండిల్ చేస్తాడని చరణ్ నమ్ముతున్నాడు. ఎఫ్ 3 తరవాత బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. అది అవ్వగానే చరణ్ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లొచ్చు.