సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు.. అవును మరి.. ఆ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ లేదు. అందుకు ఉద్యమానికి సారథ్యం వహించిన కేసీఆర్.. సకుటుంబంగా వెళ్లి ఆమెకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఆమెను తెలంగాణ ఇచ్చిన దేవతగా కూడా అభివర్ణించారు. ఆ పర్వం అయిపోయింది. ఆమె తెలంగాణ ఇచ్చింది గనుక.. తెలంగాణ ప్రజల్ని జీవితపర్యంతమూ ఆమె సారథ్యం వహించే పార్టీకే ఓట్లు వేయమని అడిగితే ఎలాగ? పోరాడిన వాళ్లు, తెలంగాణ పునాదుల్లో ప్రగతిలో, అభివృద్ధిలో భాగస్వాములు అయిన వారు… అందరి సంగతి ఏం కావాలి? ఈ లాజిక్కులు అన్నీ వదిలేసి.. కేవలం తెలంగాణ ఇచ్చింది గనుక.. సోనియాను నెత్తిన పెట్టుకోవాలని అంటే.. థాంక్స్ చెప్పేసిన తర్వాత కూడా జనం ఎందుకు పట్టించుకుంటారు? ఈ చిన్న లాజిక్‌ను అర్థం చేసుకోలేకపోతున్నందుకే.. కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలతో కునారిల్లిపోతున్నది.
సోనియా ఇచ్చింది.. అంటూ.. వీహెచ్, ఉత్తం, వంటి నేతలంతా పదేపదే భజన చేస్తూ ఉంటారు. అడిగితే అన్నం పెట్టే అమ్మ లాగా కూడా కాదు. విపరీతంగా పోరాడిన తర్వాత కానీ సోనియా రాష్ట్రం ఇవ్వలేదు. ఉద్యమం.. ప్రభుత్వం మెడమీద కత్తిలాగా మారిన ఉధృత సమయానికి ఆమె సారథ్యంలోని ప్రభుత్వం రాజ్యమేలుతున్నది గనుక.. ఇవ్వాల్సి వచ్చిది. మరో ప్రభుత్వం ఉంటే వారే ఇచ్చేవారు.. అని జనానికి క్లారిటీ వచ్చింది.
అందుకే సోనియాపట్ల కృతజ్ఞతతో కాంగ్రెసుకు ఓట్లు వేయమని రాష్ట్రంలో సాగించే ప్రచారానికి అసలు జనస్పందన ఉండడం లేదు. కానీ.. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి ప్రచార ఇన్చార్జిగా నియమితులైన ఎంపీ వీ హనుమంతరావు ఇప్పటికీ.. సోనియా భజన చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప.. ప్రజలు తమనుంచి ఏం ఆశిస్తున్నారో కనీసం ఆ వాస్తవాల్ని గుర్తించలేకపోతున్నారు. సోనియాను దేవతగా కీర్తించి భజన చేస్తూ ఉంటే.. ఆయనకు మళ్లీ రాజ్యసభ పదవి దక్కవచ్చేమో గానీ.. ఆ భజన పాటలకు ప్రజల ఓట్లు మాత్రం రాలడం లేదు. వరంగల్ ఉప ఎన్నికలో కూడా ఆ విషయం వారికి స్వానుభవంలోకి వచ్చింది గానీ.. వారు పాఠాలు నేర్చుకోలేదు. పాఠాలు తెలిసినా కూడా.. ఎవరికి వారు.. తమ తమ స్వప్రయోజనాలే లక్ష్యంగా.. అమ్మ భజనకే ప్రాధాన్యం ఇస్తూ పోతున్నారు తప్ప.. పార్టీ గెలుపు గురించి ఆలోచించే వారు. నిజానికి నగర ఎన్నికల్లో కూడా పార్టీకి ఈ భజన వైఖరే శాపంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.