ఒకరోజు నిరాహార దీక్ష చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీరుకి నిరసనగా విజయవాడలో రేపు (20న) పన్నెండు గంటలపాటు ఉపవాస దీక్షకు అన్ని ఏర్పాట్లూ సిద్ధమయ్యాయి. అయితే, ఈ దీక్షపై ప్రతిపక్ష వైకాపా నేతలు ఇప్పట్నుంచే విమర్శలు మొదలుపెట్టేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ… ఈ దీక్ష ద్వారా చంద్రబాబు ఏం సాధిద్దామని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజాధనంతో ఈ ఆర్భాటాలు ఏంటన్నారు. ఈ దీక్షకు డ్వాక్రా మహిళలు, విద్యార్థులూ పెద్ద ఎత్తున తరలి వచ్చారంటూ రేపు చాటింపేసుకుంటారనీ, నిజానికి రావాల్సింది సామాన్య ప్రజలు అన్నారు. తాము బంద్ పిలుపు ఇస్తే ముఖ్యమంత్రి తప్పుపట్టారనీ, నిరసన కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఢిల్లీకి వెళ్లి చేసుకోవాలని హితవు పలికారన్నారు. కానీ, ఆయన మాత్రం విజయవాడలో దీక్ష చేస్తారంటూ ఎద్దేవా చేశారు. తన రాజకీయ జీవితంలో ఒక్కనాడైనా ఆయన ధర్మబద్ధంగా నడిచారా అంటూ విమర్శలు గుప్పించారు.
ఇక, చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఒక రోజు దీక్ష గురించి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పందించడం విశేషం! కేంద్రం ఆంధ్రాకి అన్యాయం చేసిందనీ, మోడీ సర్కారు కళ్లు తెరిపించేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేస్తున్నారన్నారు. ఇది మంచి పరిణామమే అన్నారు. ఒక ముఖ్యమంత్రికి ఇచ్చిన వాగ్దానాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాలికి వదిలేశారనీ, జరిగిన అన్యాయం గురించి దేశవ్యాప్తంగా తెలియజెప్పడం కోసమే చంద్రబాబు దీక్ష చేపడుతున్నారని వీహెచ్ అన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతును ఎన్డీయే తీసుకుందనీ, అధికారంలోకి వచ్చాక టీడీపీతోపాటు, ఏపీ ప్రజలను కూడా మోడీ అన్యాయం చేశారని వీహెచ్ అన్నారు.
చంద్రబాబు దీక్షపై వైకాపా స్పందన ఊహించిందే. బంద్ కి, నిరాహార దీక్షకు తేడా తెలియకుండా అంబటి మాట్లాడేస్తున్నారు. బంద్ వల్ల సాధారణ ప్రజా జీవనానికి ఇబ్బందులు వస్తాయి. ఒకరోజుపాటు అన్ని రకరాల ఆర్థిక కార్యకలాపాలూ ఆగిపోతాయి. తద్వారా రాష్ట్రానికి నష్టం అని సీఎం చెప్పారు. కానీ, ఒకరోజు నిరాహార దీక్ష వల్ల సాధారణ జనజీవనానికి వచ్చే ఇబ్బందేమీ ఉండదు కదా! ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత చంద్రబాబు దీక్షకు సమర్థిస్తునట్టుగా మాట్లాడటం విశేషమే. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని వీహెచ్ చెప్పినా… టీడీపీ విషయంలో కాంగ్రెస్ ధోరణిలో వచ్చిన మార్పుగా దీన్ని అభివర్ణించేవారు లేకపోలేదు..!