2004లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. అంటే అది కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి పార్టీని బలోపేతం చేయడానికి పడిన కష్టం ఫలితమే అని ఇన్నాళ్లూ అందరూ అనుకుంటూ ఉన్నారు. అందుకే ఆయనకు నిర్ద్వంద్వంగా అప్పట్లో ముఖ్యమంత్రి స్థానాన్ని కట్టబెట్టారు. వైఎస్ పాదయాత్ర పుణ్యమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అంతా నమ్మారు. ఆ తర్వాత.. వైఎస్ పాలన బాగున్నది గనుకనే 2009లో కూడా పార్టీ అధికారంలోకి వచ్చిందని భావించారు. అయితే.. కాంగ్రెసులోనే వైఎస్ వ్యతిరేకత అణువణువునా నిండిన నాయకుల్లో ఒకరైన వీ హనుమంతరావు ఇప్పుడు ఇలాంటి యావత్తు ప్రచారాన్ని ట్రాష్గా కొట్టి పారేస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్కు అధికారం దక్కడంలో వైఎస్ఆర్ కృషి ఏమీ లేదని, చంద్రబాబు పుణ్యమే తమకు అధికారం దక్కిందని ఆయన అంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ దీక్షను ప్రకటించిన తరుణంలో.. జగన్ వైఖరిని విమర్శించిన వీహెచ్ పనిలో పనిగా ఎన్నడో మరణించిన వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా విమర్శించడానికి ఈ సందర్భాన్ని వాడుకున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ దీక్ష చేయడం కరెక్టు కాదని అంటూ.. గతంలో అనుమతులు లేకుండానే పోతిరెడ్డి పాడునుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి నీళ్లు తీసుకువెళ్లలేదా అంటూ వీహెచ్ ప్రశ్నించడం విశేషం. అప్పట్లో తెలంగాణ దిగువ ప్రాంతాలు నష్టపోతాయనే సంగతి జగన్కు తెలియదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. జగన్ దీక్ష చేయడం విడ్డూరంగా ఉన్నదని, దిగువ ప్రాంతాల కోసం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని వీహెచ్ విమర్శించడం విశేషం. పనిలో పనిగా.. ఫిరాయింపుల విషయంలోనూ జగన్ వాదనకు బలం సన్నగిల్లేలా.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డే ఫిరాయింపులకు శ్రీకారం చుట్టారంటూ సీనియర్ నేత వీహెచ్ చెప్పడం ఒక కొసమెరుపు.