కంగారు పడాల్సిన అవసరమేమీ లేదులెండి! రాయబారాలు పంపుతున్నాడు అనగానే.. ఆయన కూడా గులాబీ కండువా కప్పుకోబోతున్నారా? అనుకోవాల్సిన అవసరం లేదులెండి! సాధారణంగా ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాజకీయ వాతావరణంలో తెరాస నేతలతో ఎవరు కుశల ప్రశ్నలు మాట్లాడినా సరే.. వారు ఆ పార్టీలో చేరిపోతున్నారేమో అనుకునేలాగానే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు గులాబీ పార్టీతో నడుపుతున్న రాయబారాలు మాత్రం పార్టీలో చేరడానికి సంబంధించినవి కాదు.
కాంగ్రెస్ పార్టీలో బాగా సీనియర్, సోనియా కుటుంబానికి వీర విధేయుడుగా ఉండడం అనే ఒకే ఒక్క క్వాలిఫికేషన్‌తో దశాబ్దానికి పైగా రాజ్యసభ సభ్యత్వాన్ని మళ్లీ మళ్లీ అనుభవిస్తూ వస్తున్న నాయకుడు వి హనుమంతరావు. సోనియా విధేయతను అపరిమితమైన రూపంలో తరచూ ప్రదర్శిస్తూ ఉండడం ద్వారా ఆయనకు హైకమాండ్‌లో విపరీతమైన పట్టు ఉన్నదని అందరూ అంటూ ఉంటారు. అందుకే కాబోలు.. ఒకవైపు రాజ్యసభ ఎంపీగా ఉంటూనే.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా నగర ఎన్నికల్లో తొడకొట్టారు. కాంగ్రెస్ గెలుస్తుందని, బీసీల ప్రతినిధిగా, సీనియర్‌గా తాను సీఎం అభ్యర్థి అవుతానని కూడా ఆయన కలలు కన్నారు. కానీ అవన్నీ కల్లలయ్యాయి.
తాజాగా ఆయన రాజ్యసభ ఎంపీ పదవీకాలం కూడా ముగియబోతున్నది. కాబట్టి.. మళ్లీ ఈ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని ఆయనలో ఆరాటం మొదలైనట్లుగా ఉంది. ఇంతకు మించిన విధేయుడు, భజన పరుడు మరొకరు దొరకరు గనుక. ఈసారి కూడా ఆయనకు టిక్కెట్ ఇచ్చేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానానికి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ.. తెలంగాణ కోటాలో ఎంపీని గెలిపించుకునే అన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకే లేవు.
అలాంటి నేపథ్యంలో తనను మళ్లీ రాజ్యసభకు పంపడానికి సహకరించాలని , తెరాస ఎమ్మెల్యేల ఓట్లను కూడా తనకు వేయించాలని హనుమంతరావు కేసీఆర్ వద్దకు రాయబారాలు పంపుతున్నాడుట. గతంలో తెరాస కే కేశవరావును రాజ్యసభ ఎంపీగా బరిలోకి దించినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు అన్నీ వేసి గెలిపించాం అని, ఇప్పుడు అదే సిద్ధాంతం అనుసరించి, ప్రత్యుపకారం చేసేలా.. కాంగ్రెస్ అభ్యర్థిగా తానుంటే తెరాస ఓట్లు వేయించాలని వీహెచ్ విన్నవించుకుంటున్నారుట.
అయితే ఈ రాయబారాలు ఏ మలుపులు తిరుగుతాయో తెలియదు. అంత ఖర్మమేముంది. మా పార్టీలోకే వచ్చేయ్.. నేనే రాజ్యసభకు పంపుతా అని కేసీఆర్ అన్నా అనవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు.