కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అంతర్మధనం మొదలయింది. తమ పార్టీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉందని, దానిని బ్రతికించుకోవడానికి తక్షణమే సర్జరీ అవసరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మరో సీనియర్ నేత వి.హనుమంత రావు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.
ప్రధాని నరేంద్ర మోడీ అమలుచేస్తున్న ఎన్నికల ప్రచార వ్యూహాల ముందు తమ పార్టీ చిత్తయిపోతోందని, కనుక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి నిజాయితీగా మాట్లాడుకొంటే మంచిదని అన్నారు. పాలేరు ఉపఎన్నికలలో పార్టీ ఓటమి గురించి పార్టీలో లోతుగా చర్చ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీయే హయాంలో పదేళ్ళ పాటు దేశంలో జరిగిన అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా ప్రచారం చేసుకోలేకపోతున్నారని కానీ మోడీ ప్రభుత్వం తన రెండేళ్ళ పాలన గురించి చాలా గట్టిగా ప్రచారం చేసుకొంటూ ప్రజలను ఆకట్టుకొంటోందని హనుమంత రావు అన్నారు.
పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో దేశం బొత్తిగా అభివృద్ధి చెందలేదని ఎవరూ చెప్పలేరు కానీ అది యూపియే ప్రభుత్వం కృషి, విధానాల వలన మాత్రం కాదనే చెప్పాల్సి ఉంటుంది. పదేళ్ళ కాలంలో దేశంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేకపోయినా, యూపియే పాలన అంటే అవినీతి, అసమర్ధత, కుంభకోణాలకి మారుపేరనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. పైగా దానికి బలమైన నాయకుడు కూడా లేడు. అందుకే 2014 ఎన్నికలలో దేశప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏకగ్రీవంగా తిరస్కరించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చినా దాని తీరు మార్చుకొంటుదనే ఆశ ఎవరికీ లేదు. కనుక అది ఆత్మవిమర్శ చేసుకొన్నా ఆపరేషనే చేయించుకొన్నా దానిని ప్రజలు ఇంకా పట్టించుకోకపోవచ్చు.